రాయచూరు రూరల్: ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదేశాల మేరకు కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఇంచార్జి మంత్రి అజయ్ ధరంసింగ్ పర్యటించారు. శనివారం జిల్లాలోని మస్కి, సింధనూరు, మాన్వి తాలూకాల్లో ఆయన పర్యటించి కరువు అధ్యయనం చేశారు. మెట్ట భూముల్లో రైతులు వేసుకున్న వాడు ముఖం పట్టిన పత్తి, కంది, పొద్దు తిరుగుడు, పెసర, అలసంద, ఆముదాలు, ఇతర పంటలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కరువు కాలంలో రైతులను ఆదుకుంటుందన్నారు. రాష్ట్రంలో వర్షాలు కురవక కరువు నెలకొందని, ప్రభుత్వం స్పందించి పరిహారం అందించడానికి ప్రయత్నిస్తుందన్నారు. కరువు పరిస్థితులను అధ్యయనం చేసి సోమవారం ముఖ్యమంత్రికి నివేదికను సమర్పిస్తామన్నారు. ఎమ్మెల్సీలు బసన గౌడ బాదర్లి, బోసురాజు, ఎమ్మెల్యే బస నగౌడ, జిల్లాధికారి పూవిత, జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ తదితరులున్నారు.
పంట నష్టంపై మంత్రి సుడిగాలి పర్యటన
హొసపేటె: రాష్ట్రంలో కొత్త మంత్రులు తమకు అప్పగించిన జిల్లాల్లో కరువు పరిస్థితులపై అధ్యయనం, సర్వే ప్రారంభించారు. విజయనగర జిల్లా ఇంచార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి, కొట్టూరు, కూడ్లిగి తాలూకాల్లో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం గురించి బాధిత రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో జరిగిన పంట నష్టంపై సత్వరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అధికారులు పారదర్శకంగా నివేదికను తయారు చేయాలన్నారు. పంట నష్టాన్ని పరిశీలించడానికి క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్, జిల్లాధికారిణి కవిత ఎస్. మన్నికేరి, జెడ్పీ సీఈఓ నోంగ్జాయ్ మహ్మద్ అక్రమ్ షా, ఎస్పీ జాహ్నవి, వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు.
మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్
దెబ్బ తిన్న పత్తి పంటను పరిశీలిస్తున్న మంత్రి అజయ్ సింగ్
రాయచూరు జిల్లాలో మంత్రి
అజయ్ సింగ్ పరిశీలన
విజయనగరలో మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ పర్యటన


