విద్యా రంగానికి వీరశైవ సంస్థల సేవలు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యా రంగానికి వీరశైవ సంస్థల సేవలు భేష్‌

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

సాక్షి,బళ్లారి: స్వాతంత్య్రానికి పూర్వం నుంచి వీరశైవ విద్యాసంస్థ విద్యారంగానికి చేసిన సేవలు మరవలేనివని, కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర భారీ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్‌ పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలోని హీరద సూగమ్మ పాఠశాల శతాబ్ధి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ప్రజలకు విద్య అందించేందుకు వీరశైవ సంఘం విద్యా సంస్థలను ప్రారంభించారని గుర్తు చేశారు. పాఠశాలలు, కళాశాలలు, ఉచిత హాస్టల్స్‌ నిర్మించి కులమతాలకతీతంగా పేద విద్యార్థులను చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందన్నారు. కర్ణాటకలో సిద్దగంగా మఠం, కొప్పళ గవిసిద్దేశ్వర మఠం వంటి సంస్థలు పాఠశాలల ద్వారా విద్యార్థులకు విద్యనందిస్తున్న తరహాలో ఈ సంస్థలు విద్యాభివృద్ధి దోహదం చేస్తున్నాయన్నారు. పేదరిక నిర్మూలన విద్య ద్వారానే సాధ్యం అని భావించి ఆ దిశగా అడుగులు వేశారన్నారు.

మేమూ ఇక్కడే చదువుకున్నాం

మంత్రి నాగేంద్ర మాట్లాడుతూ తాను, తన తండ్రి ఇద్దరూ నాడు ఈ సంఘానికి చెందిన విద్యా సంస్థల్లోనే చదువుకున్నామన్నారు. విద్యారంగానికి వీరశైవ విద్యావర్ధక సంఘం అందించిన సేవలు ఆపారమన్నారు. వెనుకబడిన వర్గాలతో పాటు అన్ని వర్గాల వారికి అక్షర దాసోహం చేసిన ఘనత ఈ సంఘానికి దక్కుతుందన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ హీరద సూగమ్మను అక్షర అవ్వగా అభివర్ణించారు. ఎమ్మిగనూరు మహాంత మఠం స్వామీజీ, కమ్మరచేడు కళ్యాణ స్వామీజీ, మేయర్‌ గాదెప్ప, మాజీ మంత్రి అల్లం వీరభద్రప్ప, మాజీ ఎమ్మెల్సీ శశీల్‌ నమోశి, వీరశైవ విద్యావర్ధక సంఘం అధ్యక్షుడు మహంతేష్‌, సంఘం ప్రముఖులు జానెకుంట బసవరాజు, లిడ్కర్‌ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కోట్లాది మంది విద్యార్థుల

జీవితాల్లో వెలుగులు

భారీ, మధ్యతరహా పరిశ్రమల

శాఖ మంత్రి ఎం.బీ. పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement