కేజీఎఫ్: ఈ ఏడాది జనవరి 13వ తేదీన బంగారుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెమెల్ నగర నివాసి నిత్యానంద ఇంట్లో, హెచ్.సి. నగర నివాసి డెరిక్ అలెగ్జాండర్ ఇంటిలో జరిగిన చోరీ కేసులను బంగారుపేట పోలీసులు ఛేదించారు. తమిళనాడుకు చెందిన సురేష్ (35), వీరపాండియన్ (25), లక్ష్మణ కాంతన్ (30) అనే దొంగలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు, 475 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ ఆభరణాలను తమిళనాడులో విక్రయించగా పోలీసులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కార్యవైఖరిని ఎస్పి శివాంశు రాజపూత్ ప్రశంసించారు.
10న సీఎం పర్యటన
కోలారు: వివిధ కారణాల వల్ల వాయిదా పడిన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జిల్లా పర్యటన ఈ నెల 10వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా మాలూరు తాలూకాలో వివిధ అభివృధ్ది కార్యక్రమాలను సీఎం ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ రవికుమార్ తెలిపారు. మాలూరు తాలూకాలోని చొక్కండహళ్లి వద్ద సాధన సమావేశం సమావేశ వేదిక ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలన చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే కేవై నంజేగౌడ నేతృత్వంలో సాధనా సమావేశం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తాలూకాలో రూ.3,200 కోట్లతో అభివృధ్ది పనులు ప్రారంభిస్తున్నారని తెలిపారు.


