రాయచూరు రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ఆదేశాల మేరకు రాయచూర్ గ్రామీణలోని హుణషాల హుడా, దేవదుర్గ తాలుకాలోని రామదుర్గ, సుంకేశ్వరలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అజయ్ సింగ్ పర్యటించారు. రైతులు, అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. తీవ్ర వర్షాభావంతో పత్తి, కంది, ఇతర పంటలు ఎండిపోయాయన్నారు. కరువు పరిస్థితిని అధ్యయనం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదికలను సమర్పించడం జరుగుతుందన్నారు. పంటల బీమా, ఇన్సూరెన్స్ ఇతర పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలని తెలిపారు. కేంద్ర సర్కార్ స్పందించి పరిహారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యులు బసనగౌడ దద్దల్, శివరాజ్ పాటిల్, కరెమ్మ నాయక్, జిల్లా అధికారి పూవిత, జిల్లా ఎస్పీ పి.అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర కుమార్ కాందూ, నేతలు రామణ్ణ ఇరబగేర, శాలం తదితరులు పాల్గొన్నారు.


