14 మందిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

14 మందిపై కేసు నమోదు

Aug 8 2026 12:29 AM | Updated on Aug 8 2026 12:29 AM

హుబ్లీ: స్థలానికి సంబంధించిన వివాదంలో మహిళ ఇంట్లోకి చొరబడిన ఆరోపణలపై 14 మందిపై నగర బెండిగెరి పోలీసులు కేసు నమోదు చేశారు. బెండిగెరి బస్టాండ్‌ సమీపంలోని స్థలంలోకి వెళ్లకూడదు అంటూ బెదిరించి దాడి చేసినట్లు బాధితురాలు షరీన్‌ తెలిపింది. ఇంట్లోని సీసీ కెమెరాను కూడా ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

అంత్యక్రియలకు అవస్థలు

హుబ్లీ: కలబుర్గిలోని సేడంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మాజీ కౌన్సిలర్‌ అంత్యక్రియలకు బంధువులు పడరాని పాట్లు పడ్డారు. కమలావతి నదిలోనే శవయాత్ర సాగించి అంత్యక్రియలు పూర్తి చేశారు. వివరాలు ఇలా.. మాజీ కౌన్సిలర్‌ రాజు శుక్రవారం మృతి చెందాడు. అంత్యక్రియలు చేసేందుకు కమలావతి నది దాటాలి. నది దాటేందుకు వంతెన లేకపోవడంతో మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలించి, శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. వంతెన సమస్య చాలా రోజుల నుంచి ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు.

కరువు ప్రాంతంగా

ప్రకటించడంలో విఫలం

రాయచూరు రూరల్‌: రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించడంలో సర్కార్‌ విఫలమైందని విధాన సభ సభ్యుడు శివరాజ్‌ పాటిల్‌ ఆరోపించారు. శుక్రవారం రాయచూర్‌ తాలూకాలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అజయ్‌ సింగ్‌ తూతూమంత్రంగా పర్యటించారని ఆరోపించారు. వర్షాభావంతో రైతులు సాగు చేసిన పంటలు వాడుముఖం పట్టాయని తెలిపారు. మంత్రి అజయ్‌ సింగ్‌ను కరువు నెలకొన్న ప్రాంతాలకు తీసుకెళ్లడం లేదన్నారు. నాయకులు తమకు ఇష్టం వచ్చిన ప్రాంతాలకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. రైతులు వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను యుద్దప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు.

ఆపరేషన్‌ చేయించుకున్న

గంటలకే ఇంటర్వ్యూకు..

హుబ్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆపరేషన్‌ చేయించుకున్న ఓ యువకుడు గంటలు గడవక ముందే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. వివరాలు ఇలా.. కొప్పళ జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 26 కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జూనియర్‌ ల్యాబ్‌ సాంకేతిక అధికారి (11 పోస్టులు), ఫార్మసీ అధికారి (04) నర్సులు (11) మొత్తం 26 పోస్టులకు 2 వేల మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం హుబ్లీ కేఎంసీ ఆస్పత్రిలో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఇటీవల బైక్‌ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న గోవింద అనే నిరుద్యోగి ప్రభుత్వ కొలువు కోసం ఇంటర్వ్యూకు వచ్చాడు. ఉదయం నుంచే క్యూలో నిలబడి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సర్కారీ కొలువు కోసం నిరుద్యోగులు పడుతున్న అవస్థలకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.

చదువు నేర్పిన

గురువులను మరువరాదు

కోలారు: తాలూకాలోని అరాభికొత్తనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2001–02 టెన్త్‌ విద్యార్థుల సమ్మేళనం శుక్రవారం ఘనంగా జరిగింది. నరసాపురం పీయూసీ కళాశాల ఉపన్యాసకురాలు ఉమాదేవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరం, సంస్కారం నేర్పించి జీవితానికి దారి చూపిన పాఠశాల, ఉపాధ్యాయులను ఎన్నటికీ మరువరాదన్నారు. విద్యార్థులు నైతిక విద్యను అభ్యసించడం వల్లనే తాము చదివిన పాఠశాల, గురువులను స్మరించుకుంటున్నారన్నారు, 25 సంవత్సరాల అనంతరం గురువులను స్మరించుకోవడం ఎంతో సంతోషించదగిన విషయమన్నారు. ఇదే సమయంలో పూర్వ విద్యార్థులు పాఠశాలకు ప్రోజెక్టర్‌, ఫ్యాన్‌, పిల్లలకు ప్లేట్‌, గ్లాసులను విరాళంగా అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement