హొసపేటె: ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపీలోని కోర్ జోన్, బఫర్ జోన్, పర్యావరణ జోన్లలో నిబంధనలను ఉల్లంఘించి, అక్రమ వాణిజ్య కార్యకలాపాలు, హోంస్టేలకు అనుమతి ఇచ్చిన అధికారులపై ఉపలోకాయుక్త జస్టిస్ బీ.వీరప్ప సుమోటోగా ఫిర్యాదు దాఖలు చేశారు. హంపీ ప్రపంచ వారసత్వ ప్రదేశ నిర్వహణ అథారిటీ నియమ నిబంధనలను ఉల్లంఘించి, నిషేధిత ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ ప్రక్రియలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హొసపేటె, కొప్పళ జిల్లాల అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. హంపీ ప్రపంచ వారసత్వ ప్రాంత నిర్వహణ అథారిటీ అధికారులు, సహాయక కమిషనర్, తహసీల్దార్, టీపీ ఈఓలు, హొసపేటె, కొప్పళ జిల్లాల గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు యునెస్కో నిబంధనల ప్రకారం హంపీ సాంస్కృతిక, వారసత్వ ప్రాముఖ్యతను పరిరక్షించడానికి కోర్‌జోన్, బఫర్ జోన్‌లలో ఎలాంటి అనధికార వాణిజ్య నిర్మాణాలు, రిసార్ట్‌లు లేదా హోంస్టేలను నడపడానికి వీలు లేదు. అయితే సంబంధిత అధికారులు తమ అధికార పరిధిలో అటువంటి కార్యకలాపాలను నివారించడంలో పూర్తిగా విఫలమయ్యారని, కొన్ని చోట్ల చట్టవిరుద్దంగా అనుమతి ఇచ్చారని వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఉపలోకాయుక్త ఈ కేసును తీవ్రంగా స్వీకరించారు.


