బళ్లారిటౌన్: ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ నేతృత్వంలోని కేబినెట్‌లో ఉత్తర కర్ణాటకకు చెందిన కురుబ సముదాయ ఎమ్మెల్యేలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని జిల్లా కురుబ సంఘం డిమాండ్ చేసింది. గురువారం పత్రికా భవనంలో సంఘం అధ్యక్షుడు పీఎస్ గాదిలింగనగౌడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో తమ సముదాయానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారన్నారు. సంఖ్యా బలం ప్రకారం కనీసం నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఇద్దరికి మాత్రమే చోటు కల్పించారన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. మంత్రి మండలిలో బ్యాడగి ఎమ్మెల్యే బసవరాజ్ శివన్న పేరు రేసులో ఉన్నా అంతిమ దశలో జరిగిన మార్పులు చేర్చులలో ఆయనకు మంత్రి పదవి చేజారిందన్నారు. ఇంకా భర్తీ చేయాల్సి ఉన్న ఒక స్థానంలో ఉత్తర కర్ణాటక నుంచి తమ సముదాయం ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘం నేతలు బీఎం పాటిల్, సింధవాళ గాదిలింగనగౌడ, మల్లికార్జున, సోమప్ప, రామలింగరాజు, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


