వాల్మీకి మండలి అధ్యక్ష పదవికి రాజీనామా | - | Sakshi
Sakshi News home page

వాల్మీకి మండలి అధ్యక్ష పదవికి రాజీనామా

Aug 6 2026 2:26 AM | Updated on Aug 6 2026 2:26 AM

రాయచూరు రూరల్‌: సీఎం డీ.కే.శివకుమార్‌ మలి విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనందుకు నిరసనగా మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాయచూరు రూరల్‌ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్‌ రాజీనామా చేశారు. బుధవారం తన రాజీనామా లేఖను సీఎంకు పంపించారు. మూడేళ్ల పాటు అందరి సహకారంతో పని చేశాననే తృప్తి తనకు ఉందని తెలిపారు.

కనీస వేతనాలు అందించాలని ధర్నా

రాయచూరు రూరల్‌: కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాలు అందించాలని ఏఐటీయూసీఐ డిమాండ్‌ చేసింది. బుధవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అణ్ణప్ప మాట్లాడారు. కార్మికుల నమోదు ప్రక్రియ, రెన్యువల్‌, ఆరోగ్య భాగ్య, విద్యా, విశ్రాంతి పింఛన్‌, ఇతర పథకాలను గురించి కార్మికులకు వివరించాలన్నారు. రాష్ట్ర సర్కార్‌ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాలు అందించేలా సర్కార్‌ చర్యలు చేపట్టి వారికి సౌకర్యాలు సక్రమంగా అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

రౌడీల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు

హుబ్లీ: జిల్లా పరిధిలోని వివిధ పోలీస్‌ స్టేషన్లు, పట్టణాలు, గ్రామాల్లో రౌడీ స్క్వాడ్‌ ఆధ్వర్యంలో రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ గుంజన్‌ ఆర్య సూచనల మేరకు డీఎస్పీ ధార్వాడ గ్రామీణ, సీఐ, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. రౌడీ షీటర్ల ఇళ్లలో మారణాయుధాలు తదితరాలు ఉన్నాయా? అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా పరిధిలో మొత్తం 103 మంది రౌడీల ఇళ్లను పరిశీలించారు. అంతేగాక ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు చట్టంపై తగిన అవగాహన కల్పించి హెచ్చరికలు జారీ చేశామని జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు.

కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించండి

రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టాస్క్‌వర్క్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు బకాయి వేతనాలను చెల్లించాలని టాస్క్‌వర్క్‌ కార్మికుల సంఘం అధ్యక్షుడు నాగలింగస్వామి సర్కార్‌ను డిమాండ్‌ చేశారు. బుధవారం రాయచూరు రిపోర్టర్స్‌ గిల్డ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది నుంచి వేతనాలు లేకపోవడంతో పాటు పనులు లేని కారణంగా బకాయి వేతనాలు చెల్లించకపోవడం తగదని అన్నారు. ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేయాలన్నారు.

చెరువు పనుల తనిఖీ

హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా అయ్యనహళ్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువు పునరుద్ధరణ పనులను టీపీ ఈఓ ఎండీ ఆలంఖాన్‌ బుధవారం పరిశీలించారు. కార్మికులందరూ పనిలో నిమగ్నం కావాలని, కార్మికుల బాధ్యతలు, హక్కుల గురించి ఆయన వివరించారు. వీబీజీ రాంజీ పథకం కింద ఉన్న 318 పనులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించాలన్నారు. టీపీ పాలనాధికారి శ్రీనివాస్‌ కులకర్ణి, మన్సూర్‌ సాబ్‌, ఐఈసీ కో–ఆర్డినేటర్‌ హెచ్‌.నాగరాజ్‌, టెక్నికల్‌ కో–ఆర్డినేటర్‌, ఆస్పత్రి కోఆర్డినేటర్‌ దేవరాజ్‌, కార్మికులు పాల్గొన్నారు.

పథకాలు లబ్ధిదారులకు అందించాలి

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతులు, కూలీలకు వీబీజీ రాంజీ తదితర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌ సూచించారు. రాయచూరు తాలూకా ఇడపనూరు, నడిగడ్డ మల్కాపుర, గుండ్వేలిలో పర్యటించి అధికారులతో మాట్లాడారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి గ్రామ పంచాయతీ అధికారులు ముందుకు రావాలన్నారు. నత్తనడకన సాగుతున్న పథకాలను, అభివృద్ధి పనుల వేగాన్ని పెంచాలన్నారు. జిల్లాలో అపౌష్టికత నివారణ, పిల్లలను పొలం పనులకు పంపకుండా వారిని పాఠశాలల్లో చేర్పించడానికి శ్రమించాలన్నారు. ఆయన వెంట టీపీ ఈఓ చంద్రశేఖర్‌, బీఈఓ ఈరణ్ణ, హన్మంతు, మహేష్‌, అల్తాఫ్‌, మన్సూర్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement