సాక్షి,బళ్లారి: మంత్రివర్గ విస్తరణపై మాజీ సీఎం సిద్దరామయ్యకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన తనయుడు, మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన మంగళవారం బీదర్‌లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మలి విడత మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి మాజీ సీఎం సిద్దరామయ్య హాజరు కాకపోవడంతో ఆయన వర్గానికి చెందిన పలువురికి మంత్రి వర్గంలో చోటు కల్పించలేదన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. అలాంటిదేమీ లేదని అన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోయారని, ఆయనకు ఎలాంటి అసంతృప్తి ఏమీ లేదన్నారు. మంత్రి పదవులు రాని వారు అసంతృప్తి చెందడం, వారి మద్దతుదారులు, కార్యకర్తలు ఆందోళనలు చేయడం సర్వసాధారణం అన్నారు. అన్నీ సర్దుకు పోతాయన్నారు. హైకమాండ్ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనన్నారు. మంత్రి వర్గ కూర్పు అనేది అన్ని కోణాల్లో చేస్తారని, సీనియర్లు, పార్టీకి వివిధ రకాలుగా సేవలు అందించిన వారిని గుర్తిస్తారన్నారు. సామాజిక సమీకరణల్లో భాగంగా పలువురు కొత్తవారికి అవకాశాలు వచ్చి ఉండవచ్చన్నారు. మహిళలకు కూడా మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారన్నారు. గాయత్రీ శాంతగౌడకు కూడా ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తనకు కేటాయించిన మంత్రి పదవిని చివరి క్షణంలో ఎందుకు నిరాకరించారో తెలియడం లేదని మాత్రమే చెప్పారన్నారు. కురుబ సముదాయానికి, మైనార్టీలకు కూడా సముచిత స్థానం కల్పించారని, ఈ రెండు వర్గాల వారికే కాకుండా అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు.
కార్యకర్తలు ఆందోళనలకు దిగడం
సర్వసాధారణం
మహిళలకు కచ్చితంగా మంత్రి పదవి కేటాయిస్తారు
మాజీ సీఎం తనయుడు, మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య


