రాయచూరు రూరల్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వెనుకబడిన వర్గాల శాఖ ద్వారా మురికివాడల ప్రజలకు గృహ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని మురికివాడల వేదిక డిమాండ్ చేసింది. సోమవారం జిల్లా అధికారి కార్యాలయం ఎదుట మురికివాడల వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వేదిక సంచాలకుడు జనార్దన్ మాట్లాడుతూ.. వీధి వ్యాపారులు, కుష్ఠు రోగులు, దివ్యాంగులు, సఫాయి కర్మచారులు, దేవదాసి మహిళలు, వితంతువులు తదితర నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణ నిధులు మంజూరు చేయాలని సూచించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక అధికారికి సమర్పించారు.
స్వాతంత్య్ర సమరయోధులే మార్గదర్శకులు
రాయచూరు రూరల్: యువతకు స్వాతంత్య్ర సమరయోధుల ఆదర్శాలు మార్గదర్శకంగా నిలుస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ శావంతగేర అన్నారు. సోమవారం నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనంలో భారత స్వాతంత్య్ర సమరయోధులపై రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. జిల్లా, తాలూకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ శావంతగేర మాట్లాడారు. సమాజానికి ఉపయోగపడేలా, యువతను ఆలోచింపజేసేలా కవితలు, పుస్తకాలు రచించాలని రచయితలకు సూచించారు. ప్రస్తుతం మొబైల్‌కే పరిమితమవుతున్న యువతను పుస్తక పఠనం వైపు మళ్లించేలా సాహిత్యం ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాబు భండారిగల్, వీర హనుమాన్, బాలయ్య, యంకప్ప, యల్లప్ప, భీమేశ్, ఆనంద్, సురేష్, ప్రసన్న, మారుతి తదితరులు పాల్గొన్నారు.
బిజినెస్ లోన్
ఇస్తామని సైబర్ మోసం
హుబ్లీ: నెక్స్ట్ జెన్ ఫైనాన్స్ కంపెనీ పేరుతో సులభమైన షరతులతో బిజినెస్ లోన్లు మంజూరు చేస్తామని వ్యక్తికి సంబంధించిన గుర్తింపు పత్రాలు, దస్తావేజులు సేకరించి సైబర్ నేరానికి పాల్పడిన ఘటన హుబ్లీలో వెలుగుచూసింది. వివరాలు ఇలా.. బి.గిరిమల్లయ్య ఫేస్‌బుక్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ జెన్ ఫైనాన్స్ కంపెనీ పేరుతో ప్రకటన వచ్చింది. నెక్స్‌ట్ జన్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో సులభమైన షరత్తులతో బిజినెస్ లోన్ ఇస్తామని గిరిమల్లయ్యను నమ్మించారు. అతడి నుంచి వివిధ దస్తావేజులు, గుర్తింపు పత్రాలు తీసుకున్న వికాస్, అంకిత్, దీయా అనే వ్యక్తులు ఫుష్ బుల్లెట్ అనే అప్లికేషన్‌లో ఇన్‌స్టాల్ చేయించారు. ఈ యాప్ ద్వారా బాధితుడి మొబైల్‌లోని మెసేజ్‌లు, ఓటీపీలు సేకరించి వాటితో అక్రమంగా సైబర్ నేరాలకు పాల్పడ్డారు. దీనిపై బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సేవల్లో రోటరీ సంస్థ ఆదర్శం
కోలారు: నగరంలోని అన్ని సముదాయాలకు అనుకూలంగా నిర్మించనున్న ముక్తిధామానికి స్థలం కేటాయిస్తామని ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్ తెలిపారు. సోమవారం నగరంలోని వాసతి మహల్‌లో రోటరీ ముళబాగిలు సెంట్రల్ పదాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ జిల్లా గవర్నర్ అనిల్‌గుప్తా మాట్లాడుతూ.. సామాజిక సేవాభావంతో పనులు చేయడం ద్వారా రోటరీ సంస్థ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రోటరీ సెంట్రల్ అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ.. నగరంలో 1.5 కోట్ల వ్యయంతో ముక్తిధామం నిర్మిస్తామని వెల్లడించారు. నగరంలోని ప్రభుత్వం బాంగ్లా పాఠశాలను రూ.2 కోట్లతో జీర్నోద్ధారణ చేయడం జరుగుతుందని తెలిపారు.


