బళ్లారి అర్బన్: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి తుంగభద్ర జలాశయం నిండడంతో పాటు రైతుల పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ బళ్లారి నగర ఆరాధ్య దైవమైన కనకదుర్గమ్మ ఆలయంలో 108 మంది ముత్తైదువులతో 108 పూర్ణకుంభాల కలశయాత్ర ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం, ప్రత్యేక అర్చనలు చేశారు. మంగళ వాయిద్యాలు, భజన బృందాల నడుమ సాగిన కలశయాత్రలో పాల్గొన్న మహిళలు ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేపట్టారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు రామాంజనేయులు, మర్రిస్వామి మాట్లాడుతూ.. రైతుల శ్రేయస్సు, తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండడం, పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


