హానికర అంశాలుంటే లైసెన్స్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

హానికర అంశాలుంటే లైసెన్స్‌ రద్దు

Jul 15 2026 1:22 AM | Updated on Jul 15 2026 1:22 AM

పిజ్జా, బర్గర్‌, ఫ్రైస్‌, షావర్మా, పఫ్‌లు, కార్న్‌, అలాగే అధిక తీపి, నూనెతో వండిన దేశీయ తినుబండారాల సేవనానికి పిల్లలు అలవాటు పడ్డారు. డిమాండు పెరగడంతో పలు రకాల జంక్‌ ఫుడ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. వాటిలో పోషక విలువలు సున్నా కాగా, శరీరానికి చేసే కీడు మాత్రం అధికం. ఇలాంటి ఆహారానికి పిల్లలు బానిసలై అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు.

శివాజీనగర: బెంగళూరుతో పాటు రాష్ట్రంలో ఇటీవల రోజుల్లో పిల్లల్లో స్థూలకాయం (ఒబేసిటీ), ఫ్యాటీ లివర్‌ లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. పిల్లలు బయట విపరీతంగా జంక్‌ ఫుడ్‌ తినడమే కారణమని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆహార భద్రత, నాణ్యత, ఆరోగ్య విభాగం అధికారులు పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇష్టమైన చిప్స్‌, బజ్జీ, బోండా, బోటితో సహా వివిధ జంక్‌ ఫుడ్స్‌ అంగళ్లపై దాడులు ప్రారంభించారు.

బాలల్లో అనారోగ్య సమస్యలు

విక్రేతలపై ఆహార, ఆరోగ్యశాఖ దాడులు

ఆహార పదార్థాల్లో ప్రమాదకర దినుసులను కలిపినట్లు తేలితే ఆ దుకాణాలు, తయారీదారులపై లైసెన్సు రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గతంలో రంగు కలిపిన పానీపూరీ, బొంబై మిఠాయి, ప్లాస్టిక్‌ పేపర్లలో ఇడ్లీలను వండడం, టిఫిన్లను వడ్డించడం, బేకరీలు, మిఠాయి షాపుల్లో కేక్‌లు, లడ్డూలు కనువిందుగా కనిపించడానికి రంగులు వాడడాన్ని నిషేధించారు. అయితే ఇవన్నీ పూర్తిగా పాటిస్తున్నారా? అనేది సందేహంగానే ఉంది.

జంక్‌ ఫుడ్‌ బెడదపై రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. విద్యాలయాలు, హాస్టళ్ల పరిసరాల్లోని వందకు పైగా దుకాణాలు, బేకరీలు, హోటళ్లపై దాడులు చేసి ఆహార నమూనాలను సేకరించే పనిని ప్రారంభించామన్నారు. అనేక షాపుల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలను గుర్తించారు. ఒకే నూనెను రోజుల తరబడి వాడడం, పదే పదే నూనెలో వేయించిన బజ్జీ–బోండా, సమోసాలను విక్రయించే తదితర అంగళ్లను సీజ్‌ చేశారు. ఆరోగ్యానికి హాని చేసే రంగులు, ఇతరత్రా పదార్థాలను వాడిన తినుబండారాలను గుర్తించారు. ఆ నమూనాలను ల్యాబ్‌ పరీక్షలకు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement