తుమకూరు: మంగళవారం నగరంలోని రైల్వే స్టేషన్‌లో అరసికెరె–యలహంక నూతన మెము రైలుకు కేంద్ర మంత్రి వి.సోమణ్ణ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు రెండు ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల సంక్షేమానికే వినియోగించడం తమ కర్తవ్యమన్నారు. తురువెకెరె ఎమ్మెల్యే ఎం.టీ.కృష్ణప్ప, జిల్లా బీజేపీ అధ్యక్షుడు హెబ్బాక రవిశంకర్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి కన్నుమూత
శివాజీనగర: రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి రామచంద్రగౌడ కన్నుమూశారు. ఆయన మరణానికి సీఎం డీకే శివకుమార్‌తో పాటు బీజేపీ నాయకులు యడియూరప్ప సంతాపం వ్యక్తం చేశారు. వృద్ధాప్య అనారోగ్యంతో బెంగళూరులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచిరు. బీజేపీ నిర్మాణంలో ఆయన యడియూరప్పతో కలిసి శ్రమించారు. 1970లో రాజకీయ ప్రవేశం చేశారు. 5 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. సీఎం డీకే ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
4వ అంతస్తు నుంచి పడిన చిన్నారి
చిక్కబళ్లాపురం: తల్లిదండ్రుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాల మీదకు వచ్చింది. చిక్కబళ్లాపురం నగరం పిళ్లప్ప కాంప్లెక్స్ లో ఓ బట్టల షాపులో దుస్తులు కొనేందుకు నాలుగేళ్ల కూతురితో భార్యాభర్తలు వచ్చారు. వారు బట్టలు చూస్తుండగా, బాలిక గ్రిల్స్ వద్ద ఆడుకుంటూ దానిని ఎక్కి కిందకు పడిపోయింది. బాలికకు తీవ్ర గాయాలు తగిలాయి. మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. సిసి కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. పాపను బెంగళూరుకు తరలించారు.
గ్రామ దేవతల జాతర
బొమ్మనహళ్లి: బెంగళూరు సమీపంలో ఆనేకల్‌లో జైభీమ్ నగరలో యల్లమ్మ, గంగమ్మ దేవి, గ్రామదేవతల పట్టణ జాతర ఘనంగా జరిగింది. యల్లమ్మ, గంగమ్మ, మారమ్మ, కాళికాంబ, ముత్తుమారమ్మ, సపలమ్మ దేవతలకు పూజలు చేశారు. మహిళలు జ్యోతులను ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున కరగ మహోత్సవం కనువిందుగా జరిగింది.
అటవీశాఖపై దళితుల
ఆందోళన
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం తాలూకా సింగాట కదిరేనహళ్లి గ్రామంలో దళిత రైతుల భూ సమస్యను పరిష్కరించాలని డీఎస్‌ఎస్ కార్యకర్తలు మంగళవారం తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా చేశారు. జిల్లా అరణ్య శాఖ కార్యాలయం ముందు 29 రోజుల నుంచి నిరంతర ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సింగాటకదిరేనళ్లిలో దళితుల భూములను అటవీ శాఖ భూమిగా రికార్డు చేసి ఇబ్బంది పెడుతున్నారు, ఆ సమస్యలను త్వరగ పరిష్కరించాలి, మైలప్పనహళ్లి, గువ్వకానహళ్లి లో ఉన్న నిరుపేదలకు స్థలాలను మంజూరు చేయాలని కోరారు. తహసీల్దార్‌తో వారితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఆ రోజుల్లో హోటళ్లకు ఓకే
యశవంతపుర: ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీల సెమీస్, ఫైనల్స్ జరిగే రోజుల్లో బెంగళూరు నగర వ్యాప్తిలో హోటళ్లు, రెస్టారెంట్‌లు తెల్లవారుజాము 3:30 గంటల వరకు తెరుచుకోవడానికి పోలీసు కమిషనర్ అనుమతించారు. 14, 15 తేదీలు, 19వ తేదీన ఈ సౌలభ్యం ఉంటుంది. భారత కాలమానం ప్రకారం రాత్రివేళ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రజలకు ఆహార అవసరాల కోసం హోటళ్లకు అనుమతించారు.


