గ్రేటయ్యా.. సిద్దరామయ్య
మైసూరు: దేవరాజ అరసు తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత ఎక్కువ కాలం ఉన్న నేతగా సిద్దరామయ్య మంగళవారంతో రికార్డు సృష్టించారు. దీంతో ఆయన సన్నిహిత మంత్రులు, అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. మైసూరులో టి.కె. లేఔట్‌లోని నివాసంలోనే ఉన్న సిద్దరామయ్యను కలవడానికి నేతలు, అధికారులు తరలివచ్చారు. జిల్లా, నగర నేతలు సంబరాలు చేసుకుని లడ్డు, పలావు, మైసూరు పాక్‌లు తదితరాలను ప్రజలకు పంపిణీ చేశారు. కె.ఎస్. శివరాము, యోగేష్ ఉప్పర్, హెచ్.ఎస్. ప్రకాష్, జె.గోపీ, మోహన్, కోటేహుండి సి. మహదేవ్, హరీష్ మోగన్న తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద పోస్టర్లు, బ్యానర్లతో సందడి చేశారు. జిల్లా కలెక్టర్ జి. లక్షీమాకాంత్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్, డీఐజీ బోరలింగయ్య, ఎస్పీ మల్లికార్జున బాలదండి తదితరులు సీఎంను కలిశారు.
నాటుకోడి బిర్యానీ పంపిణీ
సీఎం సిద్ధరామయ్య నివాసం సమీపంలో నాటు కోడి బిర్యానీని ప్రజలకు పంపిణీ చేశారు. మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని నినాదాలు చేశారు. చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సిటీ బస్టాండ్‌లో మైసూర్ పాక్‌ను పంచిపెట్టారు. ఎస్.ఎన్. రాజేష్, నవీన్ కెంపి, రవిచంద్ర, రాకేష్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
సిద్దరామయ్యే సరైన వ్యక్తి: మహదేవప్ప
సిద్ధరామయ్య లేకుండా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఊహించడం కష్టం అని ఆయన మిత్రుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.సి. మహదేవప్ప అన్నారు. మంగళవారం మైసూరులోని సెనేట్ భవన్‌లో ఓ వేడుకలో మాట్లాడారు, 2028 వరకు సిద్ధరామయ్య పదవిలో ఉంటారు. అధికారం ఎల్లప్పుడూ సరైన వ్యక్తుల చేతుల్లోనే ఉండాలి. నన్ను, పరమేశ్వర్‌ను ఎవరైనా సీఎం కావాలని కోరవచ్చు. కానీ ఏకై క వ్యక్తి సిద్ధరామయ్య మాత్రమే అని చెప్పారు. సిద్ధరామయ్య అధికారం నుంచి తప్పుకుంటే, అహింద వర్గం మునిగిపోతుందన్నారు.
ఐదేళ్లూ ఆయనే సీఎం: రాయరెడ్డి
బనశంకరి: సీఎంగా సిద్దరామయ్య ఐదేళ్లు ఉంటారు. ఆయనను సగం కాలానికి ఎన్నుకోలేదు అని ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి అన్నారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్పు అనేది మీడియా సృష్టి అన్నారు. కొంతమంది కాలక్షేపానికి డీకే.శివకుమార్ సీఎంఅని చెబుతున్నారని, ఆయనకు తరువాత అవకాశం దక్కవచ్చు అన్నారు. ఈసారి బడ్జెట్ పరిమాణం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు.
సిద్దునే చెప్పారు కదా: హోంమంత్రి
శివాజీనగర: దేవరాజ అరసు రికార్డు బద్దలుకొట్టారని సీఎం సిద్దరామయ్యకు హోం మంత్రి పరమేశ్వర్ అభినందనలు తెలిపారు. ఇందుకు సోనియా, రాహుల్, ఖర్గే, వేణుగోపాల్ కూడా సహకారం అందించారన్నారు. పూర్తికాలం నేనే సీఎం అని సిద్దరామయ్య చెప్పిన తరువాత ఇంకేముంది? ఆయన విశ్వాసం అది, నాకు కూడా ఆ నమ్మకం ఉంది అని చెప్పారు.
అత్యంత దుష్పరిపాలన: జేడీఎస్
శివాజీనగర: సిద్దరామయ్యది దుష్పపరిపాలన అని ప్రతిపక్ష జేడీఎస్ ఎక్స్‌లో దుయ్యబట్టింది. రాష్ట్రంలో అత్యధిక మతకలహాలు, హింస, అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు, అవినీతిలో కర్ణాటక నంబర్ 1 రాష్ట్రమైంది. ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లారు. ప్రభుత్వ అధికారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాల్మీకి మండలి, భోవి మండలి, అంబేద్కర్ మండలిలో కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి, నిత్యావసరాల ధరలు పెంచి సామాన్య ప్రజల బతుకును నకరయాతనకు గురిచేస్తున్నారు, గుంతల రోడ్ల వల్ల ప్రజలు చనిపోతున్నారు. రాష్ట్రం అప్పులు పెరిగాయి, కులమతాల విద్వేషాలు పెచ్చరిల్లాయి అని ఆరోపించింది.
అత్యధిక కాలం సీఎంగా రికార్డు
సన్నిహితులు, అభిమానుల సంబరాలు


