ఎక్కడైనా బ్యానర్ కట్టవచ్చు
సాక్షి,బళ్లారి: బ్యానర్లు నా ఇంటి ముందూ కట్టవచ్చు, సీఎం ఇంటి ముందు కూడా బ్యానర్లు కడతారని, అంతమాత్రాన ఇంత రాద్ధాంతం చేయాలా? అని ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రశ్నించారు. ఆయన మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. రగడకు కారకులందరిపై చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. బళ్లారి గౌరవాన్ని కాపాడేందుకు పార్టీలకతీతంగా పని చేయాలన్నారు. ఉన్నతాధికారుల సలహా సూచనలతోనే ఎస్పీని సస్పెండ్ చేశారన్నారు. పుణ్య పురుషుడు వాల్మీకి విగ్రహావిష్కరణ చేయడంలో రగడ జరగడం, ఒక యువకుడు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. గొడవ జరిగిన వెంటనే తనకు మొదట ఫోన్ చేసిన వ్యక్తి మాజీ మంత్రి శ్రీరాములులేనన్నారు. పరిస్థితి అదుపు తప్పుతోందని చెప్పారని, తాను వెంటనే ఎస్పీతో మాట్లాడానన్నారు. అయితే ఎందుకు, ఎలా జరిగింది అనేదానిపై పోలీసులు విచారణ చేసి, చట్టప్రకారం ఇప్పటికే పలువురు అరెస్ట్ చేశారని, ఇంకా అరెస్ట్‌లు కూడా చేస్తారన్నారు. కాల్పుల ఘటన జరగకూడదని, అందుకు సంబంధించిన గన్‌మెన్లను కూడా అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారన్నారు.
గాలి జనార్దనరెడ్డి పైకి గురిపెట్టి
ఎక్కడ కాల్చారు?
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
మండిపాటు
బళ్లారిలో పర్యటన, మృతుని
కుటుంబానికి పరామర్శ
పక్కా స్కెచ్‌తోనే విగ్రహావిష్కరణకు బ్రేక్
నగరంలో రెండు రోజుల తర్వాత జరగాల్సిన వాల్మీకి విగ్రహావిష్కరణను పథకం ప్రకారమే అడ్డుకున్నారనే అనుమానం కలుగుతోందని డీసీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. రాజశేఖర్ మృతదేహానికి రెండుసార్లు పోస్టుమార్టం నిర్వహించారని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి పేర్కొనడంలో అర్థరహితమన్నారు. ఆయన రాజకీయంగా దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదన్నారు. ఆయన వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కచ్చితంగా ఒకేసారి పోస్టుమార్టం జరిగిందని అధికారులు సమాధానం ఇచ్చారన్నారు. రెండుసార్లు పోస్టుమార్టం కోరితే చేస్తారని, ఎలా పడితే అలా పోస్టుమార్టం చేయరన్నారు. తనపై కాల్పులు జరిపారని, హత్య చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్న గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని ఎక్కడ కాల్చారు, ఎలా కాల్చారో చెప్పాలని ఎద్దేవా చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్, ఎమ్మెల్యేలు నారా భరత్‌రెడ్డి, నాగేంద్ర, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


