ఇంటింటికీ డీఈఓ మేడం
కోలారు: జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) అంటే తీరికలేనంత బిజీగా ఉంటారు, వారు విద్యార్థులకు ఇళ్లకు వెళ్తారా? అని అనుకుంటారు. కానీ కోలారు జిల్లా డీఈఓ అల్మాస్ పర్వీజ్ తాజ్ చొరవను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తరచుగా పాఠశాలకు గైర్హాజరు అవుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆమె ఎందుకు రావడం లేదని ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు పాఠశాలలకు వచ్చి చదువుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. బుధవారం ఆమె కోలారు నగరంలో పలువురు విద్యార్థుల ఇళ్లకు వెళ్లారు. క్రమం తప్పకుండా బడికి రావాలని తెలిపారు. బాగా చదువుకుంటున్నారా? అని తల్లిదండ్రులను అడిగారు. విద్యార్థుల ముందు కూర్చుని వారు పరీక్షలకు ఏ విధంగా చదువుకుంటున్నారో పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లో సక్రమంగా చదువుతున్నారా, లేదో తెలుసుకోవడానికి ఇంటికి వెళ్లి పరిశీలన చేయడమే మంచి మార్గమని అన్నారు. టెన్త్‌లో ఎక్కువ ఉత్తీర్ణత సాధనకు శ్రమిస్తున్నట్లు చెప్పారు. పరీక్షలకు ఇంక 72 రోజులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. శిక్షణాధికారి వీణా, డివైపిసి రాజేశ్వరి తదితరులు ఉన్నారు.
కలబుర్గి సెంట్రల్ జైలులో గ్యాంగ్‌వార్
దొడ్డబళ్లాపురం: కలబుర్గిలోని సెంట్రల్ జైలు తరచూ వార్తల్లోకి వస్తోంది. తాజాగా ఖైదీలు కొట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన వెంకటరమణ అనే ఖైదీ, స్థానిక ఖైదీకి మధ్య మొదలైన వాగ్వాదం.. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే వరకూ వెళ్లింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న వెంకటరమణను ఓ వీడియో వైరల్ చేసిన కారణంగా కలబుర్గి సెంట్రల్ జైలుకు తరలించారు. 5 రోజుల క్రితమే జైళ్ల శాఖ చీఫ్ అలోక్‌కుమార్ ఆ జైలును తనిఖీ చేశారు. ఖైదీలు మద్యం, సిగరెట్లు తాగడం, జూదం ఆడుతున్న వీడియో వైరల్ కావడంతో ఆయన వెళ్లి ఏం జరుగుతోందో విచారించారు. ఇంతలోనే ఖైదీల గ్యాంగ్ వార్‌తో ఈ కారాగారంలోని లోటుపాట్లు బయటపడ్డాయి.
హోంశాఖలో డీసీఎం జోక్యమా?
● కేంద్ర మంత్రి కుమారస్వామి
శివాజీనగర: బళ్లారిలో పర్యటించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్కడ పోలీస్ అధికారుల సమావేశం ఎందుకు జరిపారు?, ఆయనకు ఆ అధికారం ఎవరు ఇచ్చారు? రాష్ట్రంలో ఉన్నది రబ్బర్ స్టాంప్ హోం మంత్రినా? అని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల మంత్రి హెచ్.డీ.కుమారస్వామి విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో నివాసంలో మీడియాతో మాట్లాడుతూ డీకేపై మండిపడ్డారు. డీసీఎం ఏ అధికారంతో పోలీస్ అధికారులతో సమావేశం జరిపారని ప్రశ్నించారు. హోం శాఖలో ఆయన జోక్యం ఏమిటి అన్నారు.
అన్నీ సందేహాలే
బళ్లారి గొడవల కేసును మూసివేతకు ప్రభుత్వం యత్నిస్తోందని కుమార ఆరోపించారు. కేవలం బ్యానర్ గొడవకే వీధుల్లో తుపాకులను పేలుస్తారా?, పోస్టుమార్టం అయిన వెంటనే కార్యకర్త మృతదేహాన్ని హడావుడిగా ఎందుకు దహనం చేశారు అని అనుమానాలు వ్యక్తంచేశారు. దీనికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలన్నారు.
ఇంటింటికీ డీఈఓ మేడం


