పెద్ద పులి పట్టివేత
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకాలోని హనగోడు సమీపంలోని బీరతమ్మనహళ్లి అడవి సరిహద్దుల్లో సంచరిస్తూ గత కొన్ని నెలలుగా ప్రజలకు ఆందోళన కలిగించిన పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. కొబ్బరి తోటలో పెట్టిన బోనులో సుమారు 6–7 ఏళ్ల వయస్సుగల మగ పులి పట్టుబడింది. గత ఐదారు నెలల నుంచి హనగోడుతో పాటు సమీపంలోని హెమ్మిగె, హెమ్మిగె కాలనీ చుట్టుపక్కల గ్రామాల్లో తరచుగా పులి సంచరిస్తూ కొన్ని పశువులను బలి తీసుకుంది. దీంతో గ్రామస్తుల ఒత్తిడి మేరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆపరేషన్‌ని ప్రారంభించారు. బుధవారం ఉదయం సిద్దేగౌడర కొబ్బరి తోటలోని బోనులోకి పులి పడింది. పులిని చూడాలని వేలాదిమంది జనం తరలివచ్చారు. బోనుకు సమీపంలో కట్టేసిన దూడ పులి గాండ్రింపులకు భయపడి సొమ్మసిల్లింది. ఏసీఎఫ్ లక్ష్మీకాంత్, ఆర్‌ఎఫ్‌ఓలు సుబ్రహ్మణ్య, నందకుమార్ తదితరులు సిబ్బంది చేరుకుని దానికి మత్తు మందు ఇచ్చి ప్రత్యేక వ్యాన్‌లో బెంగళూరు బన్నేరుఘట్ట జూపార్క్‌కి తరలించారు.
విమానాశ్రయంలో గాలింపు
మైసూరులోని మండకళ్లి విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతంలో కనిపించిన పులిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది కొడగులోని దుబారె శిబిరం నుంచి ప్రశాంత్, కంజన్, హర్ష, సుగ్రీవ అనే ఏనుగులను తెప్పించి గాలింపు ప్రారంభించారు. డీసీఎఫ్ పరమేష్, ఆర్‌ఎఫ్‌ఓ సంతోష్ హూగార్ పాల్గొన్నారు. అటవీ శాఖ నిపుణులైన సిబ్బంది, షూటర్లు, పశువైద్యుల బృందం అక్కడే మకాం వేసింది.
మైసూరు జిల్లా హుణసూరు వద్ద
ఆపరేషన్ టైగర్
పెద్ద పులి పట్టివేత


