ధార్వాడ హైకోర్టుకు బాంబు బూచీ
హుబ్లీ: ధార్వాడ హైకోర్టు పీఠంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఈ–మెయిల్ చిరునామాకు సందేశం అందింది. ఈ నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జిల్లా ఎస్పీ గుజ్జన్ ఆర్య నేతృత్వంలో తీవ్రంగా గాలించారు. కోర్టు హాలు నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు తదితరులతో పాటు కక్షిదారులను హుటాహుటిన బయటకు పంపి వేసి బాంబు స్క్వాడ్ దళంతో అణువణువు పరిశీలించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ–మెయిల్ ద్వారా సమాచారం వచ్చిందన్నారు. దీంతో తాను తక్షణమే పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశానన్నారు. అందరినీ బయటకు పంపించి వివిధ బృందాలతో కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు.
పరిశ్రమల అభివృద్ధికి
చొరవ చూపాలి
రాయచూరు రూరల్: రాయచూరులో పరిశ్రమల అభివృద్ధికి చొరవ చూపాలని రాయచూరు కాటన్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాటన్ మిల్లర్స్ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాయచూరులో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కురుబదొడ్డి, సింగనోడి, చంద్రబండల్లో 693 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. ఖాళీ స్థలానికి ప్రభుత్వం పన్ను విధించడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాయచూరు జిల్లాలో యువతకు ఉద్యోగాలు కల్పించేలా స్పిన్నింగ్ మిల్లును ప్రారంభించాలన్నారు.
అన్నదాన కేంద్రం ప్రారంభం
హుబ్లీ: నగరంలో నిరాశ్రయులకు కాసింత ఓదార్పునిచ్చి తమకు చేతనైన రీతిలో వారికి అండదండగా నిలిచిన నగరంలోని కరియప్ప శిరహట్టి దంపతులు తమ సమాజ సేవలను విస్తరించారు. క్రమంలో వారు గదగ్ జిల్లా చారిత్రాత్మక స్థలం లక్ష్మేశ్వరలో ఆకలిగొన్న వారికి అన్నం పెట్టే అన్నదాత సత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు మంగళవారం సంబంధిత బోర్డును ఆ గ్రామ ప్రముఖులచే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరియప్ప శిరహట్టి సేవా సంఘం అధ్యక్షుడు కరియప్ప మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుంచి హుబ్లీలోని వీధుల్లో నిరాశ్రయులకు, దిక్కుమొక్కులేని వారికి స్నానం, గడ్డం చేయించి, బట్టల పంపిణీతో పాటు అన్నం, చపాతీలు పెట్టే వారమన్నారు. ఈ క్రమంలో తమ సేవలను తమ సొంత ఊరు అయిన లక్ష్మేశ్వరలో కూడా చేపట్టాలని స్థానికులు మద్దతు తెలపడమే కాక అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించడంతో లక్ష్మేశ్వరలో ఆకలిగొన్న వారికి అన్నం పెట్టే కేంద్రంగా హసిదవర అన్నజోళిగె కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. నిరాశ్రయులు తమను సంప్రదించి, తమ ఆకలి బాధలను, ఇతర సమస్యలను తీర్చుకోవచ్చని కరియప్ప, సునంద దంపతులు తెలిపారు.
ధార్వాడ హైకోర్టుకు బాంబు బూచీ


