జీ రాం జీ మాకొద్దు
మండ్య: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నరేగా పథకం స్వరూపాన్ని మార్చివేసి ఆ స్థానంలో జీ రాం జీ పథకాన్ని అమలు చేయడంపై వ్యవసాయ గ్రామీణ కార్మికుల సంఘం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ ముందు బైఠాయించారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. కొత్త పథకంతో కూలికార్మికులకు 125 రోజుల పాటు పని దొరకదని, ఇబ్బందులు తప్పవని తెలిపారు. అందువల్ల పాత చట్టాన్ని పునరుద్ధరించాలని కోరారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
ధర్మస్థల మిస్సింగులపై సుప్రీంలో విచారణ
శివాజీనగర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో గత కొన్ని సంవత్సరాల నుంచి నమోదైన 74 మంది మహిళల అదృశ్యం, అనాథ శవాల కేసులపై కొత్తగా దర్యాప్తు చేపట్టాలని దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మార్చి 23 కు వాయిదా వేసింది. అత్యాచారం, హత్యకు గురైన విద్యార్థిని సౌజన్య తల్లి కుసుమావతి గౌడ ఈ పిటిషన్ వేశారు. న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ నేతృత్వపు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. వరుసగా రెండేళ్ల పాటు వందలాది అనాథ మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు గతంలో మాస్క్‌మ్యాన్ చిన్నయ్య ప్రకటించడాన్ని న్యాయవాదులు ప్రస్తావించారు. అక్కడి నేత్రావతి నది ఒడ్డులో 74 అనాథ శవాలను పూడ్చిపెట్టినట్లు ఆరోపణలు వినిపించాయి, ఆ అన్ని కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదై, విచారణ జరపాలి, అనాథ శవాలు, అదృశ్యం కేసులకు న్యాయం లభించాలని కుసుమావతి కోరారు. ఇరువర్గాల విచారణల తరువాత జడ్జిలు మార్చి ఆఖరికి వాయిదా వేశారు.
కోగిలు లేఔట్‌లో
37 కుటుంబాలే లోకల్
● 119 ఇళ్లలో అధికారుల సర్వే
శివాజీనగర: బెంగళూరులోని యలహంక కోగిలు లేఔట్‌లో ఆక్రమణల తొలగింపు తెలిసిందే. ఇందులో 37 కుటుంబాలను మినహాయిస్తే మిగిలినవారంతా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినవారని గ్రేటర్ బెంగళూరు, రెవిన్యూ, గృహవసతి అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. అక్కడ కూల్చివేసిన 119 ఇళ్లను సర్వే చేశారు, 118 కుటుంబాలకు ఆధార్ కార్డులు ఉన్నాయి, 102 కుటుంబాలకు ఓటర్ కార్డులు, 77 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నట్లు తెలిపారు. 63 కుటుంబాలకు ఆదాయ ధృవీకరణ పత్రం, 56 కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. వీరిలో 37 కుటుంబాలకు మాత్రమే గృహ వసతి లభించే అవకాశముంది.
అపార్టుమెంటులో ఫ్లాట్లు
కోగిలు బండె క్వారీ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన 167 ఇళ్లు, షెడ్లను తొలగించాక, తమకు గృహవసతి ఇవ్వాలని 250 కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇళ్ల కూల్చివేతను కేరళ సర్కారు వ్యతిరేకించడంతో ఇది రెండు రాష్ట్రాల సమస్యగా మారింది. అర్హులకు బైయప్పనహళ్లిలో నిర్మించిన వసతి అపార్టుమెంట్‌లో ఫ్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించింది.
8 నుంచి వర్షసూచన
యశవంతపుర: బంగాళాఖాతం సముద్రంలో మార్పుల కారణంగా ఈ నెల 8 నుంచి కరావళి, మలెనాడు, దక్షిణ ఒళనాడుతో అనేక ప్రాంతాలలో వానలు పడే అవకాశం ఉన్నట్లు బెంగళూరు వాతావారణశాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో మేఘావృతమై ఉంటుంది. చలిగాలులు వీచనున్నాయి. దీంతో తెల్లవారుజామున చలి అధికం కానుంది. ఎక్కువ ప్రాంతాలలో పొగమంచు ఆవరిస్తుంది. ఉత్తర ఒళనాడు, మధ్య కర్ణాటక భాగంలో చలి అధికంగా ఉంటుంది. నాలుగైదు రోజుల నుంచి చలి తగ్గినట్లే తగ్గి మళ్లీ ఎక్కువ కావడం తెలిసిందే. పగటిపూట కొంచెం ఎండలు తీవ్రత పెంచాయి. ఈ తరుణంలో వర్షసూచన వెలువడింది.
ఇంటి దొంగల అరెస్టు, భారీగా నగలు సీజ్
యశవంతపుర: ఇంటి యజమాని అభిషేక్ తాళం చెవిని ఇచ్చేసి, కుటుంబంతో కలిసి తమిళనాడుకు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఇంటిలో పనిమనిషులు దోచుకుని పరారైన కేసులో బెంగళూరు సదాశివనగర పోలీసులు పురోగతి సాధించారు. ఇంటిలో పని చేస్తున్న హాజిరా బేగం (19), ఆమె భర్త షబ్బీర్ హుసేన్(23) ను అసోంలో అరెస్ట్ చేశారు. గత నెల 30న ఈ చోరీ జరిగింది. 7 విలువైన గడియారాలతో పాటు రూ.1.37 కోట్ల విలువగల బంగారు నగలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
జీ రాం జీ మాకొద్దు


