కాల్పుల ఘటనలో ఇద్దరు గన్‌మెన్ల అరెస్ట్
సాక్షి, బళ్లారి: గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు బ్యానర్ ఏర్పాటు వివాదం చినికి, చినికి గాలి వానగా మారింది. మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో మొదలైన ఈ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న రాజకీయ సమరంలో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆప్తుడు, కాంట్రాక్టర్ సతీష్‌రెడ్డి అంగరక్షకుడు తన ప్రైవేటు గన్ తీసుకుని కాల్పులు జరపడంతో అమాయకుడైన రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో బళ్లారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నివురుగప్పిన నిప్పులా మారింది. గాలి జనార్దన్ రెడ్డిపై గన్ గురి పెట్టి కాల్పులు జరిపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ముఖ్యమంత్రి
సిద్ధరామయ్య కూడా ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఏకమైన గాలి అన్నదమ్ములు, శ్రీరాములు
ఇటీవల కొంత కాలంగా గాలి సోదరులు, శ్రీరాములు మధ్య సఖ్యత కొరవడి ఎవరికి వారు రాజకీయాల్లో కొనసాగుతున్న తరుణంలో గాలి జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలో జరిగిన ఈ వివాదం, తుపాకీ కాల్పుల ఘటనలతో అన్నదమ్ములైన మాజీ మంత్రి గాలి కరుణాకరరెడ్డి, గాలి సోమశేఖరరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ముగ్గురు ఏకమయ్యారు. గాలి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న శ్రీరాములు కూడా గాలి జనార్దనరెడ్డితో కలిసిపోవడంతో అభిమానులు, కార్యకర్తల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. బళ్లారిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసు బలగాలతో బందోబస్తు కొనసాగిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కూడా తనను హత్య చేసేందుకే కాల్పులు జరిపారని పేర్కొనడంతో ఆయన ఇంటి ముందు భద్రత కట్టుదిట్టం చేశారు. గాలి స్వగృహం వద్దకు ఆయన సన్నిహితులు, అభిమానులు, బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శనివారం భారీ జనసందోహం కిటకిటలాడింది.
ఎస్పీ సస్పెన్షన్‌పై విమర్శలు
బళ్లారిలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో అధికార బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ఎస్పీ పవన్ నెజ్జూర్‌ను సస్పెండ్ చేయడంపై జిల్లాలో సామాన్య ప్రజలతో పాటు బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఏ అధికారి అయినా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో పరిస్థితి ఎలా ఉంది? ఏయే పోలీసు స్టేషన్లలో ఎవరెవరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పని చేస్తున్నారో తెలుసుకుని వారితో శాంతిభద్రతల గురించి సమీక్షించేందుకు సమయం పడుతుంది. అలాంటిది అధికార బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే రాష్ట్రాన్ని కుదిపేసే విధంగా బళ్లారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు గాలి జనార్దన్ రెడ్డి, నారా భరత్‌రెడ్డి మధ్య రాజకీయ యుద్ధం జరిగింది. ఎమ్మెల్యే భరత్‌రెడ్డి ఆప్తుడు సతీష్‌రెడ్డికి చెందిన గన్‌మెన్ కాల్పులు జరపగా ఓ యువకుడు మృతి చెందడంతో అందుకు బాధ్యుడిని చేస్తూ ఎస్పీని సస్పెండ్ చేయడం ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఎస్పీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ నాయకులు శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎస్పీని కాదు.. డీఎస్పీ నందారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందని కూడా విమర్శలు చేశారు. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ స్పందించారు. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములుతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
12 ఎంఎం బుల్లెట్ లభ్యం
బళ్లారిలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో వాల్మీకి సర్కిల్, రాయల్ సర్కిల్ తదితర ప్రధాన కూడళ్లతో పాటు గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద కూడా భారీగా పోలీసు భద్రత కల్పించారు. కాల్పుల్లో యవకుడు మృతి చెందిన తరుణంలో పోస్టుమార్టం తర్వాత, మృతదేహంలో లభ్యమైన బుల్లెట్‌ను అన్ని కోణాల్లో పరిశీలించారు. మృతదేహం నుంచి లభ్యమైన బుల్లెట్ 12 ఎంఎం సైజులో ఉందని తేలింది. ఎవరికి చెందిన గన్ నుంచి 12 ఎంఎం బుల్లెట్ వచ్చిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విలేకరుల సమావేశంలో గాలి కరుణాకర్‌రెడ్డి, గాలి సోమశేఖర్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, గాలి నివాసం వద్దకు చేరిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు
జనార్దన్‌రెడ్డికి
మాట్లాడే హక్కు లేదు
డీసీఎం డీకే శివకుమార్
శివాజీనగర: గాలి జనార్దన్‌రెడ్డి బళ్లారిలో కాలు పెట్టే వరకు అక్కడ ఏ ఒక్క గొడవ, చిన్న అవాంఛనీయ ఘటన కూడా జరుగలేదు, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఆయన వచ్చిన తరువాతే గొడవ జరిగింది. అందువల్ల ఆయనకు మాట్లాడే ఎలాంటి హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యే నారా
భరత్ రెడ్డికి అండగా నిలుస్తుందని డీసీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. శనివారం బెంగళూరులో ఆయన మాట్లాడుతూ తాము తమ పార్టీ కార్యకర్తను కోల్పోయాం. ఇందుకు కారణం ఎవరో దర్యాప్తులో వెల్లడవుతుందన్నారు. చట్టం తన పని తాను చేస్తుంది. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందన్నారు. పోలీసు దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమన్నారు. పార్టీ ద్వారా ఈ ఘటనపై అధ్యయనానికి హెచ్.ఎం.రేవణ్ణ అధ్యక్షతన కమిటీని నియమించామన్నారు. ఈ కేసు నేపథ్యంలో అందరి ప్రైవేట్ గన్‌లను స్వాధీనం చేసుకున్నారన్నారు. గన్ లైసెన్స్ పంపిణీ విషయంలో చేపట్టాల్సిన చర్యలను సిద్ధం చేసి, నియమావళిని రూపొందిస్తామన్నారు. తన హత్యకు కుట్ర పన్నారన్న ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ గాలి జనార్దన్‌రెడ్డి ఒక డ్రామా మాస్టర్ అని అన్నారు. ఆయన మొదటే సినిమా నిర్మాత కదా? డ్రామా చేస్తారు అని చమత్కరించారు. కంచుకోటను కట్టుకొని వంద మంది భద్రతా సిబ్బందిని పెట్టుకున్న వారిని ఎవరు హత్య చేస్తారు అని ప్రశ్నించారు.
రాజకీయ దుమారం రేపిన ఫ్లెక్సీ వివాదం
ప్రైవేటు వ్యక్తి జరిపిన కాల్పులకు
ఎస్పీ సస్పెండ్
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు
గాలి నివాసం వద్దకు భారీగా చేరిన
అభిమానులు, జన సందోహం
జనార్దన్ రెడ్డి, శ్రీరాములుకు మాజీ ప్రధాని దేవెగౌడ ఫోన్‌లో పరామర్శ
మరో 40 మంది అదుపులోకి
అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం
ఎస్పీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రచారం
ఎస్పీ పవన్ నెజ్జూర్ సస్పెండ్ కావడంతో మనస్తాపానికి గురై తుమకూరుకు వెళ్లి స్నేహితుడికి చెందిన ఫాంహౌస్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు జోరుగా ప్రచారం జరిగింది. మోతాదుకు మించి నిద్ర మాత్రలు మింగడంతో ఆస్పత్రిలో చేర్చారని.. ప్రాణాపాయం లేదంటూ సోషల్ మీడియాతోపాటు అన్ని ప్రముఖ మీడియా చానల్స్‌లో ప్రచారం చేశారు. అయితే ఎస్పీ పవన్ నెజ్జూర్ ఎలాంటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు.. ఫాంహౌస్‌లో స్నేహితులతో కలిసి ఉన్నారని సన్నిహిత ఎస్పీలు, స్నేహితులు కొట్టిపారేయడం గమనార్హం.
సాక్షి,బళ్లారి: నగరంలోని గాలి జనార్ధన్‌రెడ్డి నివాసానికి సమీపంలో జరిగిన ఘర్షణలో గురువారం రాత్రి ఎమ్మెల్యే భరత్‌రెడ్డి ఆప్తుడు సతీష్‌రెడ్డికి చెందిన గన్‌మెన్లు జరిపిన కాల్పుల నేపథ్యంలో ఇద్దరు గన్‌మెన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణలో సతీష్‌రెడ్డి గన్‌మెన్ కాల్పులు జరుపుతున్న వీడియో వైరల్ కావడంతో బీజేపీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నందున పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. శనివారం సతీష్‌రెడ్డి గన్‌మెన్లను ఇద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు ఆ గొడవలో పాల్గొన్న నారా భరత్‌రెడ్డి, గాలి జనార్ధన్‌రెడ్డి అనుచరులైన 40 మందిని కూడా బ్రూస్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి రాజశేఖర్‌రెడ్డి మృతికి కారణమైన బుల్లెట్ ఎవరి గన్ నుంచి వచ్చిందో అన్ని కోణాల్లో ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.
కాల్పుల ఘటనలో ఇద్దరు గన్‌మెన్ల అరెస్ట్
కాల్పుల ఘటనలో ఇద్దరు గన్‌మెన్ల అరెస్ట్


