మృతుడి కుటుంబానికి పరామర్శ
సాక్షి,బళ్లారి: బళ్లారిలో వాల్మీకి మహర్షి విగ్రహం ఆవిష్కరణ కోసం బ్యానర్ ఏర్పాటు చేసే క్రమంలో చోటు చేసుకున్న ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందిన నేపథ్యంలో కేపీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నియమించిన సత్యశోధన కమిటీ శనివారం బళ్లారిలో పర్యటించింది. కమిటీ సభ్యులు, పంచ గ్యారెంటీల అమలు సమితి రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.ఎం.రేవణ్ణ, మాజీ ఎంపీ జయప్రకాష్ హెగ్డే, చెళ్లకెరె ఎమ్మెల్యే రఘుమూర్తి, ఎంపీ కుమార్‌నాయక్, ఎమ్మెల్సీలు బసనగౌడ బాదర్లి, జక్కప్పనవర్‌లు గాలి జనార్ధన్‌రెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘర్షణ స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నగరంలోని హుస్సేన్ నగర్‌కు వెళ్లి కార్యకర్త రాజశేఖర్ తల్లి తులసి, అక్క ఉషా, తమ్ముడు ఈశ్వర్ తదితర కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజశేఖర్ మృతి తమను ఎంతో బాధిస్తోందన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మృతుడి కుటుంబానికి ఇల్లు, తమ్ముడికి ఉపాధి అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు మేయర్ గాదెప్ప, కార్పొరేటర్ వివేక్ పాల్గొన్నారు.
రూ.25 లక్షల నగదు అందజేత
కాల్పుల్లో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ కుటుంబాన్ని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ పరామర్శించారు. శనివారం ఆయన నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే గణేష్‌తో కలిసి నగరంలో హుస్సేన్‌నగర్‌లోని రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన తల్లి, అక్క, తమ్ముడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రాణాలకు వెలకట్టలేమని, తమ వంతుగా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.25 లక్షలు అందజేస్తున్నామన్నారు. మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని సూచించారు. ఈసందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, కార్పొరేటర్ విక్కీ పాల్గొన్నారు.
అండగా ఉంటాం, ఆదుకుంటామని సత్యశోధన కమిటీ భరోసా


