ఉమ్రా యాత్రకు తరలిన ముస్లింలు
హొసపేటె: నగరంలోని అంజుమన్ షాదీ మహల్‌లో ఆదివారం జిల్లా నుంచి ఉమ్రా యాత్ర చేపట్టిన 15 మంది యాత్రికులకు సన్మానం చేసి, వీడ్కోలు పలికారు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్, కమిటీ చైర్మన్ హెచ్‌ఎన్ మొహమ్మద్ ఇమామ్ నియాజీ మాట్లాడుతూ.. గృహ నిర్మాణం, మైనార్టీ సంక్షేమ మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ ఎల్లప్పుడూ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారని తెలిపారు. ఈ సారి రాష్ట్రం అంతటా 470 మంది ఆర్థికంగా వెనుకబడిన యాత్రికులను, స్వచ్ఛంద సేవకులను గుర్తించి సొంత ఖర్చులతో ఉచితంగా ఉమ్రా యాత్రకు పంపారని పేర్కొన్నారు. పవిత్ర మక్కాలో మంత్రి ఆరోగ్య కోసం, ప్రపంచ సంక్షేమం కోసం ప్రార్థిస్తామని యాత్రికులు తెలిపారు. కార్యక్రమంలో అంజుమన్ కమిటీ ఆఫీస్ బేరర్లు అన్సార్ బాషా, సిరోజ్ ఖాన్, ఎండీ అబూబకర్, డాక్టర్ దర్వేష్, ఎండీ మొహ్సిన్ కోట్కల్, సద్దాం హుస్సేన్ కమ్యూనిటీ నాయకుడు రాధా మలార్ అహ్మద్ గఫూర్ సాబ్, షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


