ఢిల్లీకి చేరిన బ్యానర్ రగడ
జోక్యం చేసుకుంటున్న
జాతీయ స్థాయి నాయకులు
గాలికి బాసటగా
బీజేపీ పెద్దలు, నేతల పరామర్శలు
సాక్షి బళ్లారి: నగరంలో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి గృహం వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసే క్రమంలో మొదలైన వివాదం ఢిల్లీకి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర బీజేపీ–కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు మాటల సమరంతో బళ్లారి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. తన ఇంటి ముందు బ్యానర్ కట్టవద్దని గాలి జనార్దనరెడ్డి.. కట్టి తీరుతామని ఎమ్మెల్యే భరత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరణంలో మొదలైన వాగ్వాదం.. అక్కడ జరిగిన ఘర్షణ, ఓ ప్రైవేటు వ్యక్తి జరిపిన కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందడం కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా.. గాలి జనార్దన రెడ్డి, నారాభరత్ రెడ్డి కుటుంబాల మధ్య గత 20 సంవత్సరాలుగా విభేదాలు ఉన్నాయి. రాజకీయ, వ్యక్తిగత విభేదాలతో రెండు కుటుంబాలకు చెందిన నేతలు గొడవ పడుతూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరి జాతీయ స్థాయికి చేరడంతో రెండు ప్రధాన పార్టీల పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గాలి జనార్ధన రెడ్డి ఇంటి వద్దకే వచ్చి బీభత్సం సృష్టించడంతో బీజేపీ పెద్దలు రగిలిపోతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు కే.ఆర్.అశోక్‌తో పాటు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణ, విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు చలవాది నారాయణ స్వామి తదితర ప్రముఖులు గాలి జనార్దనరెడ్డి ఇంటికి చేరుకుని అండగా నిలుస్తున్నారు. స్వయంగా వివరాలు సేకరిస్తూ అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇస్తున్నారు. గాలికి భద్రత పెంచి, ఈ ఘటనకు కారణమైన ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని పట్టుబడుతున్నారు.
గాలిపై డీకే విమర్శలు..
ఎమ్మెల్యే భరత్‌రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గాలిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వారు డ్రామా ఆడుతున్నారని.. కోట గోడల్లా నిర్మించుకున్న ఇళ్లు, శత్రుదుర్భేధ్యమైన స్థలం, పెద్ద సంఖ్యలో ఉన్న అంగరక్షకులను తప్పించి వారిని అంతం చేయడం ఎవరి తరం కాదని చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి జిల్లాలోని తోరణగల్లు సమీపంలో జిందాల్ విమానాశ్రయంలో సిద్ధరామయ్యను కలిసి జరిగిన వివాదాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. మంత్రులు సంతోష్‌లాడ్, ప్రియాంక ఖర్గే తదితరులు కూడా ఎమ్మెల్యేకు అండగా నిలుస్తున్నారు.
పోలీసుల పటిష్ట భద్రత
ఇరు పార్టీలకు చెందిన రాష్ట్ర, జాతీయస్థాయి నేతల పరామర్శలు చేస్తున్న తరణంలో బ్యానర్ వివాదం ఎటు వైపు దారితీస్తుందోనని చర్చ సాగుతోంది. బ్యానర్ వివాదం ఇప్పట్లో చల్లారక పోవడంతో బళ్లారి భగభగమంటోంది. వాల్మీకి సర్కిల్, నగరంలో ప్రధాన రహదారుల్లో పోలీసులు భద్రత చేపట్టారు. గాలి జనార్దన రెడ్డి ఇంటి వద్ద పోలీసు బలగాలను మొహరించారు. ప్రతిపక్ష నాయకుడు అశోక్, గాలి జనార్దన రెడ్డి, శ్రీరాములు తదితర బీజేపీ నాయకులు పవన్ నెజ్జూర్‌కు అండగా నిలుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించారు.
ఎస్పీ సస్పెండ్‌ను సమర్థించుకున్న ప్రభుత్వం
ఇక ఎస్పీ నెజ్జూర్‌ను సస్పెండ్ చేయడ సరైందని డీసీఎం డీకే శివకుమార్ సమర్థించుకుంటున్నారు. ఘటన జరిగిన రోజు ఎస్పీకి ఫోన్ చేయగా.. ఆయన మద్యం తాగినట్లు ఉందని మండిపడ్డారు. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక శాంతిభద్రతలు పర్యవేక్షణ ఆయన మీదే ఉంటాయని హోంమంత్రి పరమేశ్వర్ చెప్పుకొచ్చారు. ఎస్పీ ఏమైనా చిన్న పిల్లవాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
నారాకు అండగా
సీఎం, డీసీఎం, మంత్రులు
ఢిల్లీకి చేరిన బ్యానర్ రగడ


