వైభవం.. బనశంకరీ దేవి రథోత్సవం
ప్రత్యేక పూల అలంకరణలో
బనశంకరీ దేవి మూలవిరాట్
బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో
శాకంబరీ దేవి
బనశంకరి: బనశంకరీ దేవి బ్రహ్మ రథోత్సవం అశేష జనవాహినితో జనసంద్రంగా మారింది. బనశంకరీ దేవి జాతర మహోత్సవాల్లో భాగంగా బనద పౌర్ణమి(పుష్యశుద్ధ పౌర్ణమి) శనివారం వేకువ జామున సుప్రభాత సేవ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ బనశంకరీ దేవి మూలవిరాట్‌కు ప్రత్యేక పంచామృత అభిషేకం చేశారు. ఆలయ అర్చకుల బృందం బనశంకరీ దేవి మూలవిరాట్‌కు ప్రత్యేక పూల అలంకరణ, శాకంబరీ దేవి మూలవిరాట్‌ను బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి కలశాలను బనశంకరీ దేవస్థాన వ్యవస్థాపన కమిటీ ఆధ్వర్యంలో మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై ప్రతిష్టించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక అలంకరణ చేపట్టి బనశంకరీ దేవి ఉత్సవమూర్తి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి విశేష అలంకరణ చేపట్టిన రథంపై అధిష్టింపజేశారు. ఆలయ ప్రధాన అర్చకుల నేతృత్వంలో అర్చకుల బృందం రథానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ఆలయ వ్యవస్థాపన కమిటీ అధ్యక్షుడు జీఎన్‌ఆర్.మోహన్, ఈఓ ఎన్.కృష్ణప్ప, కమిటీ సభ్యులు బనశంకరీ దేవి రథాన్ని లాగి రథోత్సవం ప్రారంభించారు. రథం ముందుకు కదలగానే భక్తులు అరటిపండ్లు, దవనం రథంపైకి విసిరి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం సందర్భంగా డోలు కుణిత, వీరగాసె, కేరళ చండీ మేళ, వివిధ జానపద కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. జాతర సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరణ చేపట్టడంతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. జాతర మహోత్సవానికి బెంగళూరు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలి రావడంతో జనసంద్రంగా మారింది. భక్తులు బారులు తీరి బనశంకరీ దేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బనశంకరి, కుమారస్వామి లేఔట్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా బనశంకరీ దేవస్థానం నుంచి సారక్కి వరకు భక్తులు విరివిగా అన్నదానం, మజ్జిక, పానకం వితరణ చేశారు. రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లించారు. వేడుకల్లో మాజీ కార్పొరేటర్లు ఎన్.నాగరాజు, ఎల్.శ్రీనివాస్, నారాయణ, కమిటీ సభ్యులు నాగేష్, బాలాజీ యాదవ్, రమేష్, కార్తీక్, స్మిత, సురేష్‌బాబు హాజరయ్యారు.
అమ్మవార్లకు విశేష అలంకరణలు
దర్శనానికి బారులు తీరిన భక్తులు
వైభవం.. బనశంకరీ దేవి రథోత్సవం


