అంబామఠ జాతరకు సీఎం శ్రీకారం
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకా అంబామఠంలో సుమారు 400 ఏళ్ల చరిత్రగల అంబాదేవి జాతర ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శ్రీకారం చుట్టారు. శనివారం అంబామఠ సమీపంలోని సిద్ధ పర్వతంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నెరవేర్చారు. సింధనూరులో రూ.400 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజలు చేశారు. జానపద జాతర, నృత్యం, హాస్య సంజె, దేవి పల్లకీ సేవ, నాటకం, కుంభోత్సవాలను తిలకించారు. మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, రామలింగారెడ్డి, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, ఎమ్మెల్యేలు హంపనగౌడ బాదర్లి, హంపయ్య నాయక్, రాఘవేంద్ర హిట్నాళ్, ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి, జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, తహసీల్దార్ అరుణ్ దేశాయి, టీపీ ఈఓ చంద్రశేఖర్‌లున్నారు.
జీ రామ్‌జీ చట్టం రద్దుకు డిమాండ్
శివాజీనగర: మహాత్మాగాంధీ నరేగ పథకం పేరు, స్వరూపాన్ని మార్చటాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య బలంగా వ్యతిరేకించారు. తన నివాస కార్యాలయం కృష్ణాలో శనివారం ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్, గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రియాంక ఖర్గేతో సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పల్లె అధికారాన్ని లాక్కొని గ్రామీణ ఆర్థిక పరిస్థితిని నాశనం చేసేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. గతంలో యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నరేగ పథకం ప్రజలకు ఉద్యోగ హక్కును కల్పిస్తే నేడు ఆ హక్కును హరించడం సరికాదని అన్నారు. నరేగ పథకాన్ని ముందున్న స్వరూపంలో పునర్ స్థాపించాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం నరేగ పథకాన్ని ఉపసంహరించుకొని వీబీ జీరామ్‌జీ పేరుతో కొత్త చట్టం అమల్లోకి తెచ్చే ముందుగా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను తీసుకోకుండా నేరుగా కొత్త చట్టం అమలు చేయడం ద్వారా సర్వాధికార ధోరణిని ప్రదర్శించిందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేపట్టిందన్నారు. నరేగ పథకాన్ని పునర్ స్థాపించే వరకు తాము పోరాటం చేస్తాం. సంఘ సంస్థలు, పార్టీలు ఎవరైనా కూడా తమ పోరాటంలో పాల్గొనవచ్చన్నారు. నరేగ పథకం పేరును మార్చటం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని ఆయన ఆరోపించారు.
ప్రూట్ జామ్ సీసాలో పురుగులు
చిక్కబళ్లాపురం: ప్రూట్‌జామ్ బాటిల్స్‌లో పురుగులు కనిపించిన ఘటన తాలూకాలోని నందిగ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శాంతకుమార్ అనే వ్యక్తి అదే గ్రామంలోని ఓ బేకరీలో ప్రూట్ జామ్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి మూత తీసి చూడగా పురుగులు కనిపించాయి. బాటిల్‌పై తయారీ తేదీ సెప్టెంబర్ 2025, ఎక్స్‌పైరీ డేట్ అక్టోబరు 2026 అని నమోదు చేశారు. బాటిల్‌లో పురుగులును గమనించిన శాంతకుమార్ బేకరీకి వెళ్లి ఆరా తీయగా తమకేమి తెలియదని, పంపిణీదారుడిని అడగాలని సూచించారు. దీంతో ఈ విషయంపై ఆహార నాణ్యత తనిఖీ అధికారికి ఫిర్యాదు చేస్తానని శాంతకుమార్ తెలిపారు.
కారు దగ్ధం
కృష్ణరాజపుర: చలనంలో ఉన్న కారు దగ్ధమైన ఘటన బెంగళూరు నగరం బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ మద్రాస్ రోడ్డులో జరిగింది. కోరమంగళ నివాసి డాక్టర్ నాగరాజు తన డ్రైవర్‌తో కలిసి శనివారం కారులో వెళ్తుండగా ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి కిందకు దిగారు. క్షణాల్లోనే మంటలు చెలరేగి వాహనం కాలిపోయింది. బయ్యప్పనహళ్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
అంబామఠ జాతరకు సీఎం శ్రీకారం
అంబామఠ జాతరకు సీఎం శ్రీకారం


