రాజకీయాల్లోకి ఎలా వచ్చావో గుర్తుందా?
సాక్షి, బళ్లారి: ‘రాజకీయంగా తనకు భిక్ష పెట్టింది గాలి జనార్దన్ రెడ్డే అని ఎన్నోసార్లు నువ్వే చెప్పావు. ఎక్కడో రౌడీయిజం చేసుకుని జీవిస్తున్న నిన్ను శ్రీరాములు, నేను ఈ స్థాయికి తీసుకొచ్చాం. దీన్ని మరిచి మాట్లాడితే సహించేది లేదు. శ్రీరాములు కాలిధూళికి కూడా సరిపోని నీవు.. మమల్ని విమర్శిస్తావా?’ అని బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్రపై గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఫ్లెక్సీ ఏర్పాటు వివాదంలో ఎస్పీని సస్పెండ్ చేయడం సరైంది కాదన్నారు. డీఎస్పీ నందారెడ్డిని సస్పెండ్ చేయాలని సూచించారు. ఎస్పీ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పాదయాత్ర ద్వారా పెద్ద సంఖ్యలో జనాన్ని తీసుకుని వస్తున్నప్పుడు డీఎస్పీ నందారెడ్డి వెంట ఉన్నారన్నారు. అలాంటి డీఎస్పీని బాధ్యుడిని చేయకుండా ఎస్పీని సస్పెండ్ చేయడం ఏమిటన్నారు.
గంజాయి సరఫరా చేస్తున్న
ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అనుచరుడు
ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అనుచరుడు విచ్చలవిడిగా గంజాయి సరఫరా చేస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారన్నారు. బళ్లారిలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారన్నారు. అలాంటి వారికి ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సహకారం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డాం
గాలి జనార్దన రెడ్డి ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి ఆప్తుడు సతీష్ రెడ్డికి చెందిన గన్‌మెన్లు జరిపిన కాల్పుల్లో తాము ప్రాణాలతో బయటపడ్డామంటే అది దేవుడి దయతో సాధ్యమైంది. లేకపోతే ఈ పాటికి పరలోకాలకు చేరే వారము’ అని మాజీ మంత్రి శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ రెడ్డికి ఏ హోదాతో గన్‌మెన్లను ఇచ్చారని ప్రశ్నించారు. ఆ గన్‌మెన్లు కాల్పులు జరపడానికి అధికారం ఎవరు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాగేంద్రపై విరుచుకుపడిన గాలి జనార్దన్ రెడ్డి


