గనుల తవ్వకాలతో గ్రామాలకు హాని
కోలారు: మాలూరు తాలూకా టీకల్ ఫిర్కా కరడుగుర్కి, హులిగుట్టె, ఊరుగుర్కి, జంగమహళ్లి గ్రామాల సమీపంలోని కొండ ప్రాంతాల్లో గనుల తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తవ్వకాలు జరిగే ప్రదేశానికి వంద మీటర్ల దూరంలో తమ గ్రామాలు ఉన్నాయని, కాలుష్యం వెలువడి తమ ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండ సమీపంలోనే గోమాళం భూమి ఉందని, మేత కోసం పశువులు అక్కడకు వస్తుంటాయన్నారు. తవ్వకాలతో ప్రజలతోపాటు మూగజీవాలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామ పంచాయతీ సభ్యుడు విజయకుమార్ పేర్కొన్నారు. గనుల తవ్వకాల సమయంలో డైనమెట్లను పేల్చే ప్రమాదం ఉందని, శబ్దాలకు ప్రజల ఇళ్లకు హాని జిగే ప్రమాదం ఉందన్నారు. దుమ్ము ధూళి పొలాలలపై పేరుకు పోయి పంటలు నాశనమవుతాయన్నారు. ఈ నేపథ్యంలో గనుల తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


