యల్లాపుర: కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది ఓ వివాహిత.. తన బాల్య స్నేహితుడి చేతిలో హత్యకు గురైంది. హత్య అనంతరం ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యల్లాపుర పట్టణంలో ఈ ఘటన జరిగింది. తాను వివాహానికి అంగీకరించకపోవడంతో ఆమె స్నేహితుడే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. స్నేహితురాలిని హత్య చేసిన నిందితుడు రఫిక్ ఇమామ్‌సాబ్ సమీపంలోని అడవిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు.
బాధితురాలు రంజిత బనసోడే, నిందితుడు రఫిక్ ఇద్దరూ పాఠశాల రోజుల నుంచే స్నేహితులు. రంజిత సుమారు 12 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ కటేరాను వివాహం చేసుకుంది. వీరికి 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె భర్తతో వేరుగా ఉంటూ.. యల్లాపురలో తన కుటుంబంతో నివసిస్తోంది. రంజిత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సహాయకురాలిగా పనిచేస్తోంది. రఫిక్ తరచుగా రంజిత ఇంటికి భోజనానికి వచ్చేవాడు.
అతను పెళ్లి చేసుకోమని రంజితను ఒత్తిడికి గురిచేసేవాడు. పెళ్లికి రంజితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన రఫిక్.. రంజిత పనివేళ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పదునైన కత్తితో దాడి చేశాడు. రంజితను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కొన్ని గంటల తర్వాత రఫిక్ సమీప అడవిలో ఉరేసుకుని మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద తాడు, మద్యం సీసా కూడా లభించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ దీపన్ ఎం.ఎన్. తెలిపారు.


