విమర్శిస్తే చూస్తూ ఊరుకోం
సాక్షి బళ్లారి: తమ కుటుంబాన్ని అనవసరంగా విమర్శిస్తే చూస్తూ ఉరుకోబోమని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. తమ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ.. గాలి కుటుంబంపై మాజీ బుడా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చిన్నాన్న నారా ప్రతాప్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు ఆహ్వానించడాన్ని స్వీకరిస్తున్నానని తెలిపారు. చర్చకు ఎప్పుడైనా, ఎక్కడైనా వస్తామని స్పష్టం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున తాను, తన మరదలు, (తమ్ముడు గాలి జనార్దనరెడ్డి భార్య లక్ష్మీ అరుణ) పోటీ పడటంతో ఓట్లు చీలిపోయాయి. ఎమ్మెల్యేగా నారా భరత్‌రెడ్డిని గెలిపించినందుకు జనం బాధపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నగరంలో ఏదో ఒక రెండు రోడ్లలో అభివృద్ధి పనులు చేశారని ఎద్దేవా చేశారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులను విమర్శిస్తుండటంతో జనం నవ్వుకుంటారన్నారు. ముందుగా లక్ష్మీ మిట్టల్ పరిశ్రమను ప్రారంభించాలని.. ఆ తర్వాత ఎన్‌ఎండీసీ గురించి మాట్లాడాలని సూచించారు. కొళగల్లు సమీపంలో తమ తల్లిదండ్రులు రుక్మిణమ్మ, చెంగారెడ్డి పేరు మీదుగా చెరువు నిర్మిస్తామని చెప్పిన మాట వాస్తవమే అన్నారు. అయితే అక్కడ భూమి పరిశీలన చేసిన తర్వాత అధికారుల సూచన మేరకు దానిని రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. గాలి జనార్దన రెడ్డి, శ్రీరాములు మంత్రులుగా ఉన్న సమయంలో తాను నగర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బళ్లారికి భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా రింగ్ రోడ్డు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, నగరంలో ప్రధాన రహదారుల అభివృద్ధి, కనక దుర్గమ్మ ఆలయ పనులు, బ్రిడ్జీల ఏర్పాటు తదితర పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో నగరంలో మట్కా, పేకాట, గంజాయి తదితర అసాంఘిక కార్యలాపాలు పెరిగిపోయాయన్నారు. చివరకు రేషన్ బియ్యం కూడా అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ప్రీతి గేహ్లాట్ నగర కమిషనర్‌గా ఉన్నప్పుడు నగరంలో ఎక్కడెక్కడ బ్యానర్లు, ఫెక్సీలు ఏర్పాటు చేయాలో నిబంధనలు రూపొదించారన్నారు. ప్రస్తుతం వాటిని పక్కన పెట్టి, ఇష్టారాజ్యంగా బ్యానర్లు ఏర్పాటు చేస్తుండటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో తన తమ్ముడు గాలి జనార్దనరెడ్డిని అన్యాయంగా జైలుపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బళ్లారిలో చోటు చేసుకున్న ఘటనపై సీఎం సిద్ధరామయ్య కూడా మండిపడ్డారని గుర్తు చేశారు. మా ఇంటి పేరును ప్రస్తావిస్తూ మాట్లాడితే.. మేము కూడా మీ ఇంటి పేరు ఉచ్చరించి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి విషయంలో ఎక్కడికై నా చర్చకు వస్తామంటూ మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డిని ఉద్దేశించి బదులిచ్చారు. కార్యక్రమంలో మాజీ బుడా అధ్యక్షుడు పాలన్న, వెంకటరమణ, దమ్మూరు శేఖర్, కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కే.ఎస్.దివాకర్ పాల్గొన్నారు.
బళ్లారి అభివృద్ధికి కృషి చేశాం
అభివృద్ధి పనులపై
బహిరంగ చర్చకు సిద్ధం
కాంగ్రెస్ పాలనలో పెరిగిన మట్కా, పేకాట, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి ఆగ్రహం


