దేశ ప్రగతికి కాంగ్రెస్ సహకారం
శివాజీనగర: దేశాన్ని, సమాజాన్ని విడగొట్టడమే బీజేపీ సాధన అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధ్వజమెత్తారు. ఆదివారం బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాపక దినాచరణ లో పాల్గొని మాట్లాడిన ఆయన, ఈ దేశానికి బీజేపీ సేవలు ఏమీ లేవని, దేశం, సమాజాన్ని విడగొట్టడమే వీరి సాధన, పని అని ఆరోపించారు. బీజేపీ మూలమైన ఆర్‌ఎస్‌ఎస్ దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నడూ పాల్గొనలేదు. పైగా బ్రిటిష్‌వారితో జత కలిశారు, క్విట్ ఇండియా పోరాటంలో వారి పాత్ర లేదు, కానీ ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌వారు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు అని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌వారు ముందునుంచి కూడా మహాత్మా గాంధీని ద్వేషిస్తున్నారని, వారి కార్యకర్త గాడ్సే.. గాంధీజీని హత్యచేశాడని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీజీ పేరును తొలగించింది బీజేపీనే అన్నారు. ఆధునికి భారత నిర్మాత జవహర్‌లాల్ నెహ్రూ, దేశానికి జైజవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చినవారు లాల్ బహుదూర్ శాస్త్రి, సామాజిక న్యాయం కోసం కట్టుబడిన ఇందిరాగాంధీ గరీబీ హఠావో అన్నారని కొనియాడారు. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకొచ్చినవారు రాజీవ్‌గాంధీ అని చెప్పారు.
ఏ సర్కారు వచ్చినా గ్యారెంటీలు: డీసీఎం
పంచ గ్యారెంటీలను ఏ ప్రభుత్వం వచ్చినా నిలుపుదల చేయడం సాధ్యం కాదు, ఈ పథకాలు దేశానికే ఆదర్శమని డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ చెప్పారు. ప్రతి పంచాయితీలో గ్యారెంటీ సంబరాలు జరపాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలో తాలూకా, జిల్లా పంచాయితీ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో బూత్ స్థాయిలో పని చేసేవారికి టికెట్ ఇస్తామన్నారు. నాయకుల వెనుక తిరిగేవారికి టికెట్ ఉండదని తెలిపారు.
తాలూకా, జిల్లా పంచాయితీ ఎన్నికల టికెట్లకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. జనరల్ వర్గంవారు రూ.50 వేలు, మిగత వర్గాలు రూ. 25 వేల డీడీని దరఖాస్తుతో సహా అందజేయాలని తెలిపారు. ఈ నిధి కాంగ్రెస్ పార్టీ భవనాల నిర్మాణం కోసమే అని చెప్పారు. ఈ సందర్భంలో కొందరు మహిళా కార్యకర్తలు దరఖాస్తు సొమ్మును తగ్గించాలని కోరగా, శివకుమార్ తిరస్కరించారు. చివరకు సీఎం సిద్దరామయ్య చెప్పడంతో మహిళలకు రూ.25 వేలే టికెట్ దరఖాస్తు ఫీజు అని తగ్గింపును డీకే ప్రకటించారు.
ఉపాధి పథకం నుంచి గాంధీజీ పేరును తీసేయడాన్ని ఖండిస్తూ జనవరి 5 నుంచి కాంగ్రెస్ నిరసనలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చేసిందేమీ లేదు
కాంగ్రెస్ దినోత్సవంలో సీఎం సిద్దు


