ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే అరెస్టే: కమిషనర్
బనశంకరి: నూతన ఏడాది సంబరాలలో అసాంఘిక ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య పోలీస్ అధికారులకు ఆదేశించారు. సోమవారం సీఎం నివాస కార్యాలయంలో హోంమంత్రి పరమేశ్వర్, డీజీపీ ఎంఏ.సలీం, పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తదితరులతో ఆయన సమావేశం జరిపారు. మహిళల సురక్షత కు అన్ని చర్యలూ తీసుకోవాలని, ఎలాంటి రభస జరగకుండా చూసుకోవాలన్నారు. న్యూ ఇయర్ సంబరాల తరువాత ప్రజలు ఇళ్లకు వెళ్లడానికి అనుకూలమయ్యేలా 31న అర్ధరాత్రి తరువాత ఎక్కువ సంఖ్యలో బీఎంటీసీ బస్సులను నడపాలన్నారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, చర్చ్‌స్ట్రీట్, కోరమంగల, ఇందిరానగర తో పాటు సామూహిక సంబరాలు జరిగే ప్రముఖ స్థలాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, గొడవలేవీ జరగకుండా చూడాలన్నారు. 20 వేల మంది పోలీసులను నియమించామని, ఇతర జిల్లాల నుంచి ఎక్కువమంది మహిళా పోలీసులను పిలిపించినట్లు అధికారులు చెప్పారు. 4 కంట్రోల్ రూమ్‌లు, 78 వాచ్ టవర్లు, 164 మహిళా సహాయ డెస్క్‌లు, 55 అంబులెన్సులు అందుబాటులో ఉంటాయన్నారు. గత మూడురోజుల్లో 3,500 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు, కట్టడి చేస్తున్నట్లు తెలిపారు. 31న రాత్రి నుంచి నగరంలోని 50 ఫ్లై ఓవర్లపై ద్విచక్రవాహనాల సంచారం నిలిపివేయాలని, పోకిరీ బైకిస్టులపై కఠినచర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ కార్యకలాపాలపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని సిద్దరామయ్య తెలిపారు.
ఇక్కడ పార్కింగ్ వసతి
ప్రజల కోసం శివాజీనగర బీఎంటీసీ షాపింగ్ కాంప్లెక్స్ మొదటి అంతస్తు, యుబీ.సిటీ, గరుడామాల్, కబ్బన్‌రోడ్డు జంక్షన్ నుంచి కమర్షియల్ స్ట్రీట్ జంక్షన్ వరకు వాహనాలను నిలుపుకోవచ్చు.
సోమవారం రాత్రి బెంగళూరు బ్రిగేడ్ రోడ్డులో న్యూ ఇయర్ లైట్ల శోభ
హద్దులు లేని ఆనందం.. బెంగళూరులో ఓ ప్రైవేటు పార్టీ (ఫైల్)
వేడుకలు జరిగే చోట భారీ భద్రత
అవాంఛనీయాలు జరగకుండా చర్యలు
పోలీసులకు సీఎం ఆదేశం
సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
31 తేదీ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజున తెల్లవారుజామున 2 గంటల వరకు బెంగళూరులో తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు తో పాటు పలుప్రాంతాల్లో వాహనాల సంచారం, పార్కింగ్‌పై నిషేధం ఉంటుంది. అనేక కూడళ్లను మూసివేస్తారు. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొని ప్రయాణించాలి. ముమ్మరంగా ట్రాఫిక్ డైవర్షన్‌ను చేపట్టారు.
బెంగళూరులో న్యూ ఇయర్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. 31వ తేదీ సాయంత్రం నుంచే ఎంజీ, బ్రిగేడ్ రోడ్డు, కమర్షియల్ వీధి తదితరాలలో యువత చేరి చిందులు మొదలెడతారు. తెల్లవారుజామువరకూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుగుతాయి.
న్యూ ఇయర్ సంబరాల సమయంలో ఇతరులకు ఇబ్బంది కలిగించేవారిని దయాదాక్షిణ్యాలు లేకుండా అరెస్ట్ చేస్తామని పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త ఏడాది ఉత్సవాలను సంతోషంగా జరుపుకోండి. ఇతరులకు కూడా అవకాశం ఇవ్వండి. కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల సురక్షత, రద్దీ నియంత్రణ తమకు మొదటి ప్రాధాన్యత అన్నారు. బైక్ వీలర్లపై కఠిన చర్యలు తప్పవన్నారు. వేడుకల తరువాత ఇళ్లకు వెళ్లేవారి కోసం మొదటిసారిగా బస్‌లు, టెంపో ట్రావెలర్ వాహనాలను కల్పించామని తెలిపారు. అల్లరిమూకలపై మ్యాజిక్ బాక్స్‌తో నిరంతరం సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు.
ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే అరెస్టే: కమిషనర్
ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే అరెస్టే: కమిషనర్
ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే అరెస్టే: కమిషనర్


