తారు పేరుతో రూ.31 లక్షల మోసం
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో సైబర్ నేరాలు పెరిగాయి. భద్రావతికి చెందిన డాంబరు (తారు) వ్యాపారిని హైవేస్ అథారిటీలో నమోదు సాకుతో రూ.31,06,300 మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాధితునికి హనీ సింగ్ సబర్వాల్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యాడు. తాను ఒక కంపెనీ ఎండీగా పరిచయం చేసుకున్నాడు. కర్ణాటకలో హైవే పనులు చేయబోతున్నానని, తారు సరఫరా చేయాలని చెప్పాడు. ఇందుకోసం మీరు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మీ పేరును నమోదు చేసుకోవాలని చెప్పాడు. తరువాత, రిజిస్ట్రేషన్, ఇతరత్రా ఫీజులు చెల్లించాలని చెప్పారు, ఇలా వ్యాపారి సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 22 మధ్య మోసగాళ్ల కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాకు మొత్తం రూ.31,06,300 బదిలీ చేశాడు. మరింత డబ్బు చెల్లించాలని వేధించసాగారు. చివరకు మోసపోయినట్లు గ్రహించి శివమొగ్గలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
మరొకరికి రూ.6 లక్షలు
భద్రావతికి చెందిన ఒక వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.6.23 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలు.. టెలిగ్రాం యాప్‌లో వచ్చిన ఓ లింక్‌ను క్లిక్ చేయగా ‘టాటా క్లిక్ ఫ్యాషన్ అనే టెలిగ్రాం గ్రూప్‌లో చేరాడు. ఫ్యాషన్ దుస్తుల అమ్మకం గురించి అందులో చర్చించారు. మీ ద్వారా ఫ్యాషన్ ఉత్పత్తులను కొంటామని బాధితునికి ఓ వ్యక్తి కాల్ చేశాడు. కంపెనీ ఇచ్చిన పనులు పూర్తి చేస్తే అధిక లాభాలు వస్తాయని హామీ ఇచ్చాడు. దీనిని నమ్మిన ఫిర్యాదుదారుడు డిసెంబర్ 18 నుంచి 25 మధ్య రూ.6,23,155 బదిలీ చేశాడు. మోసపోయినట్లు తెలిసి సీఈఎన్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
శివమొగ్గ జిల్లాలో సైబర్ క్రైం


