కన్నడ భాషే సార్వభౌమ
శివాజీనగర: కర్ణాటకలో కన్నడ వాతావరణాన్ని పెంపొందించడం మనందరి బాధ్యత. రాష్ట్రంలో కన్నడనే సార్వభౌమ అని సీఎం సిద్దరామయ్య అన్నారు. ప్రసిద్ధ కవి కువెంపు జయంతి సందర్భంగా సోమవారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఏర్పాటైన జన రాజ్యోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కన్నడనాట ఏ భాష నేర్చినా కన్నడిగులగానే ఉండాలన్నారు. కన్నడ భాష, భూమి, నీరు, సరిహద్దు గురించి పోరాటం చేసే ప్రవృత్తిని పెంచుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో కూడా కన్నడ పాఠశాల ఉండాలన్నారు. ఇటీవల ఆంగ్లభాషా వ్యామోహం అధికమైంది. తల్లిదండ్రుల సహాయం లేకపోతే కన్నడ పాఠశాలలు ఉండటం, వృద్ధి చెందటం కష్టమని వాపోయారు.
కేంద్రం సవతి తల్లి ప్రేమ
రాష్ట్ర ప్రభుత్వం హిందీని వ్యతిరేకించటం లేదు. అయితే హిందీ దేశ భాష కాదని సీఎం అన్నారు. మహదాయి ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు చేపడతామన్నారు. కృష్ణా మూడో దశ ప్రాజెక్ట్‌కు కేంద్రం గెజెట్ విడుదల చేయడం లేదన్నారు. కేంద్రం సవతి తల్లి ధోరణిని కన్నడగులు ఖండించాలని తెలిపారు. కన్నడిగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడంపై కేబినెట్‌లో చర్చిస్తామని చెప్పారు. కర్ణాటకలో కన్నడిగులకే ఉద్యోగాలు లభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నడ సంఘాల నాయకులు రచయితలు పాల్గొన్నారు. కాగా బెంగళూరుతో సహా రాష్ట్రమంతటా కువెంపు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
హిందీ దేశ భాష కాదు
సీఎం సిద్దరామయ్య


