యశవంతపుర: 9వ తరగతి ఫెయిల్ అవుతానానే భయంతో విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా డి కారేహళ్లి బోవి కాలనీలో జరిగింది. గ్రామానికి చెందిన వర్షిణి(15) పట్టణంలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఇటీవల 9 పరీక్షలు ముగిశాయి. పరీక్షలు సరిగ్గా రాయని కారణంగా ఫెయిల్ అవుతాననే భయం పట్టుకుంది.ఈక్రమంలో శొంఠి పంటకు తెచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కడూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
అనుమానిత బాంబ్ లభ్యం
బనశంకరి: సంపిగేహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న బెళ్లళ్లి అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి ఇంటిలో శుక్రవారం పోలీసులు తనిఖీ చేశారు. బాంబు తరహాలో ఉన్న పేలుడు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కు పంపారు. అబ్దుల్ రెహమాన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బాంబు తరహా వస్తువు తనకు రోడ్డులో దొరికిందని విచారణలో వెల్లడించాడు.
పరీక్ష కేంద్రంలో
సీసీ కెమెరా ధ్వంసం
దొడ్డబళ్లాపురం: 10వ తరగతి పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ధ్వంసం చేసిన సంఘటన దొడ్డ తాలూకా తూబుగెరె గ్రామంలో చోటుచేసుకుంది. తూబుగెరె ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. కలెక్టర్ ఎంబీ బసవరాజు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు.పరీక్షలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చిన్నారిపై అంగన్‌వాడీ ఆయా రాక్షసత్వం
● వాత పెట్టి, డైపర్‌లో కారం పొడి వేసిన వైనం
దొడ్డబళ్లాపురం: అల్లరి చేస్తోందని చిన్నారిపై అంగన్‌వాడీ ఆయా వాత పెట్టి, డైపర్‌లో కారం పొడి వేసి రాక్షసత్వం ప్రదర్శించిన సంఘటన కనకపుర తాలూకా మహారాజకట్టె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ నివాసులపై రమేశ్, చైత్ర దంపతులు తమ రెండున్నరేళ్ల వయస్సుగల దీక్షిత్‌ను గ్రామంలోని అంగన్‌వాడీ స్కూల్‌కు పంపిస్తున్నారు. అయితే అంగన్‌వాడీ ఆయా చంద్రమ్మ దీక్షిత్ పదేపదే మూత్ర విసర్జన చేస్తున్నాడని, అల్లరి ఎక్కువ చేస్తున్నాడనే కారణంతో వాత పెట్టి డైపర్‌లో కారం పొడి పెట్టి అమానుషంగా ప్రవర్తించింది. విషయం తెలిసి చిన్నారి దీక్షిత్ తల్లిదండ్రులు కనకపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రమ్మను విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండు చేస్తున్నారు.
దర్శకుడు రఘు కన్నుమూత
యశవంతపుర: కన్నడ సినిమా రంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు, రచయిత ఏ.టీ.రఘు(76) గురువారం రాత్రి 9:20 గంటలకు బెంగళూరులో కన్నుమూశారు. నాలుగైదేళ్ల నుంచి రఘు మూత్రపిండాల వైఫల్యం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. పార్థవదేహాన్ని ఆర్‌నగర మఠదహళ్లిలోని స్వగృహంలో ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హెబ్బాళ శ్మశానవాటికలో అంత్యక్రియలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. దివంగత నటుడు అంబరీశ్ నటించిన మండ్యద గండు సినిమాను రఘు దర్శకత్వం వహించారు. రఘుకు కన్నడ సినిమా రంగంలో మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆయనతో కలిసి 27 సినిమాలు తీయగా కన్నడలో 55 సినిమాలను నిర్మించారు. మండ్యద గండుతో పాటు జైలర్ జగన్నాథ్, బెటెగార, ధర్మదయుద్ధ, న్యాయనీతి ధర్మలాంటి సినిమాను తీశారు.
యాసిడ్ దాడికేసులో
పదేళ్ల జైలు
బొమ్మనహళ్లి : యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల జైలు, రూ.10లక్షల జరిమానా విధిస్తూ బెంగళూరు నగర జిల్లా, ఆనేకల్ 3వ ఆదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. బసప్ప అనే వ్యక్తి 2019న డిసెంబర్ 18వ తేదిన ఆనంద్ హెచ్.మేటి ఆనే వ్యక్తి ముఖంపై యాసిడ్‌తో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో సర్జాపుర పోలీసులు బసప్పను అరెస్ట్ చేశారు. ఈకేసు శుక్రవారం కోర్టులో విచారణకు వచ్చింది. నిందితుడి నేరం నిరూపితం కావడంతో బసప్పకు పదేళ్ల జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సోమశేఖర్ తీర్పు వెలువరించారు.
ఫెయిల్ అవుతానేమోనని ఆత్మహత్య