నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం

Mar 21 2025 1:38 AM | Updated on Mar 21 2025 1:33 AM

సాక్షి, బళ్లారి: ప్రతి విద్యార్థి జీవితంలో బంగారు భవిష్యత్తుకు పునాదిగా, ఉన్నత స్థానాలకు, లక్ష్యాలకు చేరుకోవడానికి మొదటి మెట్టు అయిన 10వ తరగతి పరీక్షలు నేడు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2024–25వ విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికార యంత్రాంగం విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బళ్లారి జిల్లాలో గత ఏడాది రాష్ట్రంలోని ఫలితాలను చూస్తే 28వ స్థానానికి పడిపోవడంతో ఈ సారి గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించడానికి విద్యాశాఖ యంత్రాంగం తీవ్ర కసరత్తు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలో బళ్లారి తూర్పు, పశ్చిమ, సండూరు, సిరుగుప్ప వలయాలకు సంబంధించి మొత్తం 23,524 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు.

పరీక్షల వివరాలివే

ఇక పరీక్ష సబ్జెక్టుల విషయానికొస్తే మార్చి 21న ప్రథమ భాష తీసుకున్న విద్యార్థులు మొదటి రోజు ఇంగ్లిష్‌, కన్నడ, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు రాస్తారు. మార్చి 24న గణితం, మార్చి 26న ద్వితీయ భాష ఇంగ్లిష్‌, కన్నడ, మార్చి 29న సోషల్‌ సైన్స్‌, ఏప్రిల్‌ 2న సైన్స్‌, 4న తృతీయ భాషగా హిందీ, కన్నడ, ఇంగ్లిష్‌, ఉర్దూ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు పరీక్షలు రాయడానికి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గత ఏడాది రాష్ట్రంలోని ఫలితాల్లో బళ్లారి జిల్లాకు తక్కువగా రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారిణికి ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టారు. 2023వ సంవత్సరంలో కూడా బళ్లారి జిల్లా 31వ స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 320 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 23,524 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఆయా కేంద్రాల వద్దకు నిర్ణీత సమయానికన్నా ముందుగా హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

టెన్షన్‌కు గురి కావద్దు

ఇప్పటికే ప్రీ ఫైనల్‌లో రెండు, మూడు సార్లు పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎస్‌ఎస్‌ఎల్‌సీ బోర్డు పరీక్షలు నేడు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి విద్యార్థిలో ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి టెన్షన్‌కు గురి కావద్దన్నారు. ప్రతి ఒక్కరూ తమ పాఠశాలల్లో అందజేసిన హాల్‌ టిక్కెట్లు, పెన్నులు, పరీక్షలను నిర్ణీత సమయాని కంటే ముందే తీసుకొని ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు రావాలని సూచించారు. బళ్లారి జిల్లాతో పాటు విజయనగర, కొప్పళ, రాయచూరు, గదగ్‌, బీదర్‌, బాగలకోటె, ధార్వాడ తదితర కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక పరిధిలోని అన్ని జిల్లాల్లో 10వ తరగతి పరీక్షలు ఏకకాలంలో ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు పరీక్షల సజావుగా నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

ఈనెల 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు

జిల్లాలో 23,525 మంది

విద్యార్థులు హాజరు

గత ఏడాది కంటే

మెరుగైన ఫలితాల కోసం నిరీక్షణ

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం 1
1/1

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement