హొసపేటె: మహా కుంభమేళా అనంతరం హుబ్లీ–తిరుపతి రైలు (నెంబర్: 57401/57402)ను మూడు నెలల తర్వాత మార్చి 17 నుంచి పునః ప్రారంభించడం సంతోషకరమని విజయనగర రైల్వే అభివృద్ధి కార్యాచరణ సమితి అధ్యక్షుడు వై.యమునేష్, కార్యదర్శి కే.మహేష్ పేర్కొన్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ బెళగావి–హైదరాబాద్– మణుగూరు రైలు (నెంబర్: 07335/07336)ను కూడా సత్వరం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. హుబ్లీ–తిరుపతి రైలు హుబ్లీ నుంచి బయలుదేరి ఉదయం 6 గంటలకు గదగ్ మీదుగా హొసపేటెకు ఉదయం 9 గంటలకు చేరుకుంటుందన్నారు. ఆపై బళ్లారి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, కడప మీదుగా రాత్రికి తిరుపతికి చేరుతుందన్నారు. తిరుపతి నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 5:20 గంటలకు హొసపేటెకు చేరుకుని రాత్రి 9:30 గంటలకు హుబ్లీకి చేరుకుంటుందన్నారు. ఈ రైలు ప్రయాణికులకు హొసపేటె నుంచి హుబ్లీకి రూ.35, హొసపేటె నుంచి బళ్లారికి రూ.20, గుంతకల్‌కి రూ.35, తిరుపతికి రూ.85 చొప్పున అతి తక్కువ ఛార్జీల సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రైళ్ల రాకపోకలు, ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు సకాలంలో అందేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని సమితి సభ్యులు కోరారు.