పీజీ హాస్టల్లో యువతి హత్య | - | Sakshi
Sakshi News home page

పీజీ హాస్టల్లో యువతి హత్య

Jul 25 2024 7:00 AM | Updated on Jul 25 2024 7:09 AM

-

సిలికాన్‌ సిటీలో ఘోరం

హంతకుని కోసం గాలింపు

బనశంకరి: మహిళా పీజీ హాస్టల్‌లోకి చొరబడిన ఓ దుండగుడు యువతి గొంతుకోసి హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూరు కోరమంగల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బిహార్‌ కు చెందిన కృతికుమారి (24) హతురాలు. వివరాలు.. ఎంబీఏ పూర్తిచేసిన కృతి బెంగళూరుకు చేరుకుని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కోరమంగలలో వీఆర్‌ లేఔట్‌లోని పీజీలో ఉంటోంది. మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లి రాత్రి తిరిగివచ్చింది. దుండగుడు రాత్రి 11.10 నుంచి 11.30 మధ్య పీజీ యజమాని, మహిళా సెక్యూరిటీ గార్డు కళ్లు గప్పి పీజీలోకి చొరబడి మూడవ అంతస్తులోని కృతికుమారి రూమ్‌లోకి వెళ్లి చాకుతో గొంతుకోసి అక్కడ నుంచి ఉడాయించాడు.

తెలిసినవారి పనేనా?
కొన్ని గంటల తరువాత విషయం తెలిసి పోలీసులు చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం సెయింట్‌జాన్స్‌ ఆసుపత్రికి తరలించారు. తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలున్నాయి. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పీజీ చుట్టుపక్కల రోడ్లలో సీసీ కెమెరాల చిత్రాలను పోలీసులు సేకరించి హంతకుని కోసం గాలింపు చేపట్టారు. ఈ హత్యతో పీజీలోని యువతులు భయభ్రాంతులకు గురయ్యారు.

హంతకుడెవరో తెలిసింది: డీసీపీ
ఆగ్నేయ విభాగ డీసీపీ సారా ఫాతిమా మాట్లాడుతూ పీజీ యజమాని నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది. హంతకుని ఆచూకీ తెలిసిందని త్వరగా అరెస్ట్‌ చేస్తామని ఆమె తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement