
దొడ్డబళ్లాపురం: ఎమ్మెల్యే ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తామని కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వివరాలు.. నెలమంగల నివాసి రిటైర్డ్ ఉప తహసీల్దార్ బీ హొంబయ్య అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పొందాలనుకున్నాడు. ఈ క్రమంలో నాగరాజు, హరిశాస్త్రి, వీరేశ్ అనే ముగ్గురు వ్యక్తులతో చర్చించాడు. వీరు 2022 డిసెంబర్‌లో హొంబయ్యను కలిసి తమ వద్ద రూ.49 కోట్ల డీడీ ఉందని, రూ.50 లక్షలు ఇస్తే మూడు రోజుల్లో తిరిగి ఇస్తామని నమ్మబలికారు. అలా పలు దఫాలుగా రూ.1 కోటి 29 లక్షలు ఇచ్చానన్నాడు. డీడీ ఇంకా నగదు కాలేదంటూ మొత్తంగా రూ 5 కోట్ల వరకూ వసూలు చేశారని, తరువాత ముఖం చాటేశారని చెప్పాడు. ఆ ముగ్గురిపై నెలమంగల పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు.
మంత్రి అనుచరులు బెదిరిస్తున్నారు
శివాజీనగర: విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప అనుచరులు తనను బెదిరిస్తున్నారని ప్రణవానంద స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ప్రణవానంద స్వామి, తనకు ఫోన్ కాల్ చేసి మంత్రి మధు బంగారప్ప అనుచరులు బెదిరిస్తున్నారు. తాను శరణ సంస్కృతి ప్రకారం వివాహం చేసుకున్నాను. సముదాయం కోసం పోరాటం చేపట్టానని తెలిపారు. తనను భయపెట్టి, బెదిరించి పోరాటాన్ని అణచివేసేందుకు యత్నిస్తున్నారు. వారి బెదిరింపులకు లొంగనని, ప్రాణ బెదిరింపు నేపథ్యంలో ప్రణవానందస్వామి శనివారం పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.