సొంత ఖర్చుతో విద్యార్థులకు విమానయానం
● విద్యాయాత్ర ఖర్చు భరించిన హెచ్‌ఎం
హొసపేటె: కొప్పళ జిల్లా బహదూర్‌బండి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీరప్ప అంగడి శనివారం తన సొంత ఖర్చుతో 24 మంది విద్యార్థులు, ఇద్దరు ఎస్‌డీఎంసీ సభ్యులు, తన పాఠశాలలోని 12 మంది ఉపాధ్యాయులను విమానంలో బెంగళూరుకు విద్యా యాత్రకు తీసుకెళ్లారు. బళ్లారి జిల్లా తోరణగల్లులోని జిందాల్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరిన పిల్లలు విమానంలో వారి ఫోటోలను క్లిక్ చేసి సందడి చేశారు. హెచ్‌ఎం బీరప్ప విద్యార్థుల విమాన ప్రయాణం, ఆహారం, వసతి ఖర్చులను చెల్లించారు. విమానంలో యాత్రకు వెళ్లే విద్యార్థులను ఎంపిక చేయడానికి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 5 నుంచి 8వ తరగతి వరకు ప్రతి తరగతి నుంచి ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసి విద్యాయాత్రకు తీసుకెళ్లారు.


