కొత్త సంవత్సర క్యాలెండర్ల విడుదల
సాక్షి బళ్లారి: జిల్లా బీజేపీ రైతు మోర్చా అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త గణపాల్ ఐనాథ్‌రెడ్డి కొత్త సంవత్సర క్యాలెండర్లను విడుదల చేశారు. శనివారం ఆయన తన నేతృత్వంలో నిర్వహిస్తున్న హేమ, వేమరెడ్డి సౌహార్ధ సహకార సంఘం, శ్రీకృష్ణ ట్రేడింగ్ కంపెనీ, గణపాల్ ట్రేడింగ్ కంపెనీ, విజయనగర ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విజయనగర శైక్షణిక సేవా ట్రస్ట్, గోవిందరెడ్డి వేర్‌హౌసింగ్ కంపెనీ, చైత్ర కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీల పేర్లతో రూపొందించిన క్యాలెండర్లను తమ కుటుంబ సభ్యులు, కంపెనీ సిబ్బంది సమక్షంలో విడుదల చేశారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర–2026 క్యాలెండర్‌ను అందజేశారు.
టీటీడీ నుంచి పురంధరోత్సవ అవార్డు
రాయచూరు రూరల్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)వారు 2025–26వ సంవత్సరానికి కర్ణాటకలోని గడినాడు ప్రాంతం రాయచూరు జిల్లాకు చెందిన సీనియర్ కవయిత్రి, అధ్యాపకురాలు డాక్టర్ జయలక్ష్మి మంగళ మూర్తికి పురంధరోత్సవ అవార్డు ప్రకటించారు. ఆమె దాస సాహిత్య పరిషత్ విద్వాంసురాలు కావడం విశేషం. జనవరి 17న తిరుమలలో జరుగనున్న పురంధర దాసుల ఆరాధన కార్యక్రమంలో అవార్డును అందచేయనున్నట్లు దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి వేదమూర్తి పండిత్ ఆనంద్ తీర్థాచారి పగడాల వెల్లడించారు.
నరేగ పథకం పేరు మార్పు తగదు
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేగ పథకం పేరును మార్చడం తగదని, ఎన్‌డీఏ అంటే నేమ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అని కళ్యాణ కర్ణాటక బోర్డు అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆరోపించారు. శనివారం కేకేఆర్‌డీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(నరేగ) పథకం పేరును మార్చి కేంద్ర ప్రభుత్వం పేదల కడుపు కొట్టిందన్నారు. గతంలో కేంద్రం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులతో ఈ పథకం కింద కూలికార్మికులతో ఉపాధి పనులు చేయిస్తుండగా నేడు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో పనులు కల్పించేలా కొత్త చట్టం తెచ్చారని ఎద్దేవా చేశారు. నరేగ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరూ
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, విజయ నగర, బళ్లారి, కలబుర్గి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో శనగ పంటను పండించినందున శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కర్ణాటక రైతు సంఘం నేత ఆనందప్ప రుద్రప్ప డిమాండ్ చేశారు. శనివారం కొప్పళ జిల్లా కుకనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జొన్న, వేరుశనగ, పత్తి, మిరప, ఇతర వాణిజ్య పంటలు భారీ వర్షాలకు నష్టపోయాయన్నారు. ఈ విషయాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల మద్దతు ధరను ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినతిపత్రం సమర్పించారు.
చెట్టుకు బైక్ ఢీ.. ఇద్దరు దుర్మరణం
రాయచూరు రూరల్: బైక్ చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకాలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి గాంధీనగర్, గొరేబాళ గ్రామాల మధ్య మూడలగిరి క్యాంప్‌లో ఈ ఘటన సంభవించింది. సింధనూరు తాలూకాలోని గాంధీనగర్‌కు చెందిన సంతోష్(22), హన్మంతరాయ(22) అనే ఇద్దరు మరణించినట్లు సింధనూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ వినాయక్, ఎస్‌ఐ మౌనేష్ తెలిపారు. రాత్రి 12 గంటల సమయంలో మద్యం తాగి అతి వేగంగా వాహనం నడపడంతో అదుపు తప్పి చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మరణించారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కొత్త సంవత్సర క్యాలెండర్ల విడుదల
కొత్త సంవత్సర క్యాలెండర్ల విడుదల
కొత్త సంవత్సర క్యాలెండర్ల విడుదల
కొత్త సంవత్సర క్యాలెండర్ల విడుదల


