దేశం కోసం యువత పాటుపడాలి
రాయచూరు రూరల్: నేటి యువత సైన్యంలో చేరి దేశం కోసం శ్రమించాలని మేజర్ భరత్ భూషణ్ పిలుపునిచ్చారు. వేదాంత కశాశాలలో తాలూక కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాభ్యాసం ముగిసిన వెంటనే వివిధ రకాలె పోటీ పరీక్షలను ఎదుర్కొన్న మాదిరిగా సైన్యంలో చేరడానికి ఆర్మీ రిక్రూట్‌మెంట్ జరుగుతుందన్నారు. సైన్యంలో చేరితే క్రమశిక్షణ, ధైర్యం, శారీరకంగా, మానసికంగా సైనిక అస్త్రం లాంటిదన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రత్యేక ఉపన్యాసం చేశారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా నుంచి సైన్యంలో చేరడానికి వెనుకడుగు వేయడాన్ని ఖండించారు. దేశ సరిహద్దుల్లోనే కాకుండా రాష్ట్ర సరిహదుదల్లో కూడా అంతర్గత భద్రత, ఉగ్రవాదం, సంఘటిత నేరాలు, సైబర్ కేసులు, సమస్యల గురించి కూడా ఆయన వివరించారు. కసాప అధ్యక్షుడు విజయ్ రాజేంద్ర, రాకేష్ రాజలబండి, వెంకటేశ్వర్లు, అమరేష్, దేవేంద్రమ్మలున్నారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
రాయచూరు రూరల్: గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను బళగానూరు పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకాలో జరిగింది. శనివారం బళగానూరు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు దాడి చేయగా మాన్వి తాలూకాలోని తడకల్‌కు చెందిన అంబణ్ణ(28) సింధనూరు తాలూకా బాలయ్య క్యాంపునకు చెందిన దిద్దిగి మౌనేష్(38), సిద్దప్ప(29)ను అరెస్ట్ చేశామని బళగానూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ యర్రియప్ప తెలిపారు. 174 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రైతుకు పరిహారం ఇవ్వాలి
రాయచూరు రూరల్: పత్తిని అమ్మిన డబ్బులు బ్యాంక్‌లో వేసిన మరుక్షణంలో మాయం అయ్యాయని, ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని అఖిల కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాన్వి తాలూకా మాచనూరుకు చెందిన మహిళా రైతు జ్యోతి పత్తి మార్కెట్‌లో విక్రయించగా, వచ్చిన సొమ్ము రూ.6,70,222 లను మాన్విలోని కెనరా బ్యాంక్ శాఖలో డిపాజిట్ చేశారన్నారు. అయితే 24 గంటల్లోనే బ్యాంక్ నుంచి డబ్బులు పూర్తిగా మాయం అయిందన్నారు. బ్యాంక్ అధికారులు, పోలీసులు సరైన సమాచారం అందించడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు విచారణను త్వరిత గతిన చేపట్టాలని ఒత్తిడి చేశారు. విలేఖర్ల సమావేశంలో జ్యోతి, శరణ బసవ, గోవింద, మల్లణ్ణలున్నారు.
ఆభరణాల చోరీ.. బాలుడి అరెస్ట్
● రూ.3.12 లక్షల విలువైన
బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
హుబ్లీ: ధార్వాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దరామ కాలనీలోని ఓ ఇంట్లో బంగారు, వెండి నగలు చోరీ చేసి పరారైన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొల్లర కాలనీ నివాసి షాహిల్ జాఫర్ గోకాక్ అనే బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 22న సచిన్ హూగార్ అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగలగొట్టి ఆభరణాలను చోరీ చేసినట్లు కేసు దాఖలైంది. గోపనకొప్ప రోడ్డులో బాలుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 22 గ్రాముల బంగారు, 88 గ్రాముల వెండితో కలిపి రూ.3,12,558 విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. కేసు దర్యాప్తులో చొరవ చూపిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.
రోడ్డు భద్రత మాసాచరణకు అన్ని ఏర్పాట్లు చేయండి
● న్యాయమూర్తి కేఎం రాజశేఖర్
హొసపేటె: జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి జనవరి 1 నుంచి 30 వరకు రోడ్డు భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాల నిర్వహణకు సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కేఎం.రాజశేఖర్ అన్నారు. శుక్రవారం నగరంలో ప్రధాన జిల్లా సెషన్స్ కోర్టు ప్రాంగణంలో ప్రాంతీయ రవాణా శాఖ నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాస సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. రోడ్డు నియమాలు, ప్రమాదాల నివారణ, సురక్షితమైన రోడ్డు ట్రాఫిక్ గురించి అవగాహన కల్పించడానికి అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన ర్యాలీలు, వీధి నాటకాలు నిర్వహించాలన్నారు. అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కుమారస్వామి, తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సుబ్రమణ్య, ఆర్‌టీఓ కే.దామోదర్, బీఈఓ శేఖర్ హొరపేటె పాల్గొన్నారు.
జ్ఞాన సముపార్జన అవసరం
రాయచూరు రూరల్: విద్యార్థులు జ్ఞాన సముపార్జన కోసం విద్యనభ్యసించాలే తప్ప అధిక మార్కుల కోసం కాదని మ్యాక్స్‌వెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనివారం మ్యాక్స్‌వెల్ కళాశాలలో జరిగిన విజ్ఙాన మేళాలో పాల్గొని విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. నేటి పోటీ యుగంలో చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకొని జ్ఞానం పొందాలన్నారు. మార్కులు సాధించాలని పోతే జీవితాలకు అపాయం కలుగుతుందన్నారు. కన్నడ భాష, నీరు, భూమిపై గౌరవం ప్రదర్శించి రక్షించాలన్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన విజ్ఞాన వస్తు నమూనాలను పరిశీలించారు.
దేశం కోసం యువత పాటుపడాలి


