భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మండల పూజ
బళ్లారి అర్బన్: నగరంలోని అనంతపురం రోడ్డులో తారానాథ ఆస్పత్రి ఎదురుగా రాఘవేంద్ర కాలనీలో వెలసిన శబరి అయ్యప్ప దేవస్థానంలో 43వ వార్షిక మండల పూజను దేవస్థాన ట్రస్ట్ అధ్యక్షుడు జయప్రకాష్ జే గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. ధ్వజారోహణం, గణహోమం, నవగ్రహ హోమం, అయ్యప్ప స్వామి హోమం, విశేష అష్ట్రదవ్యాభిషేకం, మహామంగళ హారతి, మాలధారి అయ్యప్పలతో లక్ష అర్చన, అయ్యప్ప స్వామి నామ స్మరణతో భజన భక్తి గీతాలను పాడారు. పూర్ణాహుతి అనంతరం మహా మంగళ హారతి జరిపారు. సాయంత్రం శ్రీరంగ స్వామి వేణు బృందంచే అయ్యప్ప భక్తిగీతాలను ఆలపించి 18వ పడిపూజను చేశారు. పూజల్లో వందలాది మంది అయ్యప్ప స్వాములతో పాటు వేలాదిగా నగర భక్తాదులు పాల్గొన్నారు.
హొసపేటె: మండల పూజలో భాగంగా శుక్రవారం ఆలయంలోని అయ్యప్ప స్వామి విగ్రహానికి అష్టాభిషేకం చేసి, ప్రత్యేక అలంకరణలతో అలకరించి పూజలు చేశారు. ప్రధాన పూజారి గణేష్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత నవగ్రహ, దుర్గ, సుదర్శన హోమం, క్షిప్ర కార్యసిద్ధార్థ గణపతి హోమం జరిపారు. అయ్యప్ప మాలధారులు సహా వేలాది మంది భక్తులు ఉదయం నుంచి అయ్యప్ప ఆలయానికి చేరుకుని దేవుడిని దర్శనం చేసుకున్నారు.
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మండల పూజ


