ఎస్‌ఐ భార్య అనుమానాస్పద మృతి.. అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ భార్య అనుమానాస్పద మృతి.. అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని

Jun 4 2023 7:16 AM | Updated on Jun 4 2023 8:33 AM

- - Sakshi

కర్ణాటక: సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ భార్య అనుమానస్పద స్థితిలో ఉరి వేసుకొని శవమైన సంఘటన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం బేగూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న పటేల్‌ లేఔట్‌లో జరిగింది. మృతురాలు ఎస్‌ఐ రమేష్‌ భార్య శిల్ప (33). వివరాలు.. కాలేజీలో చదివే రోజుల్లో రమేష్‌, శిల్పా ఇద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. తరువాత రమేష్‌కు ఎస్‌ఐ ఉద్యోగం వచ్చింది, కొన్నాళ్లకు ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. కానీ కొద్దిరోజులకే కాపురంలో కలతలు వచ్చాయి. శిల్పను కులం పేరుతో వేధించినట్లు, రోజూ గొడవపడేవారని ఆరోపణలు వచ్చాయి. దాంతో శిల్ప భర్త రమేష్‌ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టడంతో పోలీసులు పెద్దల సమక్షంలో ఇద్దరికీ రాజీ పంచాయతీ చేసి పంపించారు.

అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంట్లో శిల్ప ఉరికి వేలాడింది. శిల్పను ఎలాగైనా వదిలించుకోవాలని హత్య చేసి ఇది ఆత్మహత్యగా చెబుతున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇద్దరూ ప్రేమించుకుని సహజీవనం చేశారని, పెళ్లి చేసుకోమంటే రమేష్‌ ఒప్పుకోలేదని తెలిపారు. కానీ ఆమె ఫిర్యాదు చేస్తే ఉద్యోగం పోతుందనే భయంతో రిజిస్టర్‌ పెళ్లి చేసుకుని, వేధింపులకు దిగాడని చెప్పారు. ఆమెకు ఖర్చులకు, ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు కాదని, తామే పుట్టింటి నుంచి పంపేవారమని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. రమేష్‌ ఆస్తి కోసం అక్క కుమార్తెను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడని, అందుకే శిల్పను అంతమొందించాడని విలపించారు. బేగూరు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టగా రమేష్‌ పరారీలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement