టెండర్‌లో ఉన్నా పనుల్లో మిస్
గ్లోబ్ పేరిట బిల్లు తీసుకోలేదంటున్న సుడా
జ్యోతిబాపూలే జంక్షన్ సుందరీకరణ వివాదం
కరీంనగర్‌కార్పొరేషన్: నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఉన్న జ్యోతిబా పూలే జంక్షన్ సుందరీకరణ పనులపై పలువురి ఫిర్యాదుతో వివాదం మొదలైంది. టెండర్‌లో పేర్కొన్నట్లుగా పనులు కనిపించకపోవడంపై ఫిర్యాదుదారుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, చేసిన పనికి మాత్రమే బిల్లులు తీసుకున్నారంటూ సుడా చెబుతోంది.
గ్లోబ్ వివాదం
సుడా నిధులు రూ.15 లక్షలతో జ్యోతిబా పూలే జంక్షన్ సుందరీకరణకు గతేడాది టెండర్ పిలిచారు. ఎర్త్‌వర్క్, గ్రీనరీ, ఎలక్ట్రికల్, గ్లోబ్ తదితర 13 అంశాలతో సంబంధిత కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నాడు. అందుకు అనుగుణంగా గతేడాది పనులు మొదలు పెట్టి పూర్తి చేశారు. అయితే ఇందులో రూ.6లక్షల 35 వేల విలువైన ఆర్టిస్టిక్ గ్లోబ్ విత్ స్టూడెంట్స్ అనే పనికి సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడం ఇప్పుడు వివాదంగా మారింది. టెండర్‌లో 5వ అంశంగా గ్లోబ్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించినా, చేసిన పనిలో అది లేకపోవడంపై పలువురు సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
బిల్లు ఎత్తలేదు
సుడా నిధులతో చేపట్టిన జ్యోతిబా పూలే జంక్షన్ సుందరీకరణలో కాంట్రాక్టర్ రూ.10 లక్షలు (11.90 లక్షలకు డిడక్షన్ పోను) బిల్లు తీసుకున్నాడని, చేసిన పనికి ఇంకా బిల్లు రావాల్సి ఉందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. కాంట్రాక్ట్ పనితో తనకు సంబంధం లేనప్పటికీ సుడా మాజీ చైర్మన్‌గా తాను వాస్తవాలు వెల్లడిస్తున్నానని సోమవారం మీడియాకు తెలిపారు. జంక్షన్‌లో గ్లోబ్ నిర్మాణం చేపట్టనే లేదని, దాని పేరిట ఎక్కడా బిల్లు కూడా ఎత్తలేదన్నారు. రూ.12 లక్షలకు సంబంధించిన బిల్లులకు సంబంధించి ఐటెం వారీగా వివరాలు ఉన్నాయన్నారు. ఇప్పటికీ జంక్షన్ రెయిలింగ్, ఇతరత్రా పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇవ్వలేదని, అందుకే రూ.4లక్షల పనిని అధికారులు ప్రతిపాదించారన్నారు. చేయని పనికి బిల్లులు ఎత్తడం ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే టెండర్‌లో పేర్కొన్నప్పటికీ పనులు జరుగుతున్న సమయంలో అంచనాలు పెరిగితే, ఒక ఐటెంను తప్పించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గ్లోబ్ పేరిట బిల్లు ఎత్తలేదు కాబట్టి, జ్యోతిబా పూలే జంక్షన్‌లోనూ ఇలానే జరిగి ఉండవచ్చంటున్నారు.


