● మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్‌కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని 3వ డివిజన్ విద్యారణ్యపురిలో డ్రైనేజీ, 23వ డివిజన్ బాలాజీనగర్‌లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో పనులు మంజూరు చేస్తున్నామని, అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నగర ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కార్పొరేటర్లు సాదినేని లావణ్య మునీందర్, గుమ్మడి రాజ్‌కుమార్, వరాల నర్సింగం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌రూరల్: వ్యక్తిగత ఆర్థిక నిర్వహణపై విద్యార్థులకు అవగాహన ఉండాలని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ పి.సతీశ్‌కుమార్ అన్నారు. సోమవారం నగునూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్సనల్ ఫైనాన్స్ అండ్ వెల్త్‌క్రియేషన్ అంశంపై రెండురోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. స్టాక్‌మార్కెట్, మ్యూచువల్‌ఫండ్స్, ఎస్‌ఐపీలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం ఫైనాన్షియల్ అవెన్యూస్ సెషన్‌లో వర్క్‌షాప్ డైరెక్టర్, అకాడమిక్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం కన్వీనర్ ఎన్‌వీ రంగప్రసాద్, డాక్టర్ జి.సమత, కోటగిరి శంకర్‌లింగం వివిధ ఆర్థిక మార్గాలు, స్టాక్‌మార్కెట్ పెట్టుబడులు, మ్యూచువల్‌ఫండ్స్, ఎస్‌ఐపీలద్వారా పెట్టుబడి చేయడంపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ మాలతి, వైస్ ప్రిన్సిపాల్ పద్మజ, కామర్స్ డిపార్ట్‌మెంట్ కన్వీనర్ ఈశ్వరమ్మ, సమత, సరిత, స్వప్న, దీప్తి తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం నగునూరు సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు సీపీ గెట్–2026 ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపాల్ మాలతి తెలిపారు. బాటనీ విభాగంలో డి.శ్యామల 11వ ర్యాంకు, పొలిటికల్‌సైన్స్‌లో టి.చందన 56, జువాలజీలో డి.శ్యామల–17, హెచ్‌ఆర్‌ఎంలో పి.కావ్య– 121, కంప్యూటర్‌సైన్స్‌లో జక్కం అక్షర–131, ఫిజిక్స్‌లో మారిశెట్టి వినీల–112, తెలుగులో ఎస్.శ్రావ్య–101, శ్రీవాణి–148, డాటాసైన్స్‌లో తేజస్వి–148, లక్ష్మిపూజిత–150, స్టాటిస్టిక్స్‌లో స్రవంతి–71వ ర్యాంకు సాధించారు. ఈసందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను సోమవారం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పద్మజ, ఏసీవో వసుమతి, అధ్యాపకులు అభినందించారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: నగరంలో 11 కేవీ గోదాంగడ్డ ఫీడర్‌పై మరమ్మతు పనుల కారణంగా మంగళవారం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు తాహెరా మసీదు, శ్రీనగర్ కాలనీ, అంజనాద్రి ఆలయం, దోబిఘాట్, గోదాంగడ్డ, బీఎస్‌ఎఫ్, జెడ్పీ క్వార్టర్స్, భగత్‌నగర్, మల్లమ్మ మార్కెట్ సమీపం, కొమ్ము రాజు, రఘుపతిరెడ్డి ఆసుపత్రి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్–2 ఏడీఈ లావణ్య తెలిపారు.


