కరీంనగర్‌టౌన్: ఎన్నికల సమయంలో ఆడబిడ్డల వివాహానికి ‘తులం బంగారం’ ఇస్తామని ఆర్భాటంగా హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ మాట నిలబెట్టుకోలేక ఇప్పుడు కుట్రలకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ధ్వజమెత్తారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసేందుకు ప్రభుత్వమే తెరవెనుక నుంచి హైకోర్టులో కేసు వేయించి స్టే తెచ్చిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర పిలుపు మేరకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశానుసారం నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని పథకాలకు చట్టబద్ధత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్పొరేటర్లు నలువాల రవీందర్, యూసుఫ్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


