● 194 యూనిట్లు వాడినా రూ.1,146 బిల్లు
● 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలేది?
వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి క్షేత్రస్థాయిలో ఎన్నో లొసుగులు కనిపిస్తున్నాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. వేములవాడలో ఓ గృహ యజమాని 194 యూనిట్లు మాత్రమే వినియోగించినా బిల్లు వచ్చింది. పట్టణానికి చెందిన కనకయ్య తన ఇంటి అవసరాలకు 194 యూనిట్ల విద్యుత్ వినియోగించగా... రూ.1,146 బిల్లు వచ్చింది. అదే బిల్లులో యూనిట్‌కు రూ.2.62 చొప్పున రూ.510.21 సబ్సిడీ చూపించింది. అయినా బిల్లు చెల్లించాలని అందులో ఉంది.
13 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
గంగాధర: మండలంలోని నారాయణపూర్ సర్పంచ్ దీకొండ బాబాలక్ష్మి భర్త మధు ఆత్మహత్యాయత్నానికి కారణమైన 13మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. గ్రామంలో బుధవారం గ్రామసభ జరుగుతుండగా కొంతమంది అడ్డుకుని దళిత సర్పంచ్ అని చూడకుండా భయభ్రాంతులకు గురిచేశారు. మధు ఆపే ప్రయత్నం చేయగా అంతు చూస్తామని బెదించారు. బెదిరింపులను తట్టుకోలేక మధ్యాహ్నం మధు గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. సర్పంచ్ బాబాలక్ష్మి ఫిర్యాదు మేరకు అన్నాడి దామోదర్‌రెడ్డి, బత్తిని వెంకటరమణ, సుంకె శంకర్, ఎండీ.నజీర్, తోడేటి అనిల్, తోడేటి రాజేందర్, జడ మహేశ్, మ్యాకల మల్లేశ్, మ్యాకల హరిబాబు, పెద్దిప్యాట శ్రీపతి చారి, గుర్రం రాము, మేకల మల్లేశం, కాటిపెల్లి శ్రీనివాస్‌రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఎమ్మెల్యే పరామర్శ
సర్పంచ్ ధీకొండ బాబలక్ష్మి భర్త ధీకొండ మధును చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం పరామర్శించారు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి జరిగే గ్రామసభల్లో రాజకీయ కక్షలతో ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, బాధ్యులపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు.


