పర్యాటకం కావొద్దు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకం కావొద్దు ప్రమాదం

Aug 12 2026 12:22 AM | Updated on Aug 12 2026 12:22 AM

మానేరులో జరిగిన విషాద ఘటనలు

జాగ్రత్తలు పాటించాలి

అప్రమత్తంగా ఉండాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జలాశయాలు జలకళతో తొలకరిస్తుండటంతో పర్యాటకుల సందడి పెరిగింది. ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు తరలివస్తున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యం, అత్యుత్సాహం వల్ల పర్యాటకం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందువల్ల నీరు ఉన్న ప్రాంతాలు, జలాశయాల వద్దకు వెళ్లే పర్యాటకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు.

జిల్లాలోని సందర్శయ ప్రాంతాలు

మిడ్‌మానేరు ప్రాజెక్టు (శ్రీరాజరాజేశ్వర జలాశయం–బోయినపల్లి/మాన్వాడ): 27.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ భారీ ప్రాజెక్టులోకి నీరు చేరడంతో నిత్యం పర్యాటకులు గుమిగూడుతున్నారు.

తంగళ్లపల్లి మిడ్‌ మానేరు బ్యాక్‌వాటర్‌ (గోపాల్‌రావుపల్లె): చుట్టూ కొండలు, మధ్యలో నీటి తలాలు ఉన్న ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

అప్పర్‌ మానేరు ప్రాజెక్టు (గంభీరావుపేట/నర్మాల): చారిత్రాత్మకమైన ఈ ప్రాజెక్టు అలుగు పారే సమయంలో పరిసర గ్రామాలు, ఇతర జిల్లాల నుంచి సందర్శకులు వేల సంఖ్యలో వస్తుంటారు.

ఇటీవలి ప్రమాదకర విన్యాసాలు

ఇటీవల తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లె శివారు మిడ్‌ మానేరు బ్యాక్‌వాటర్‌ వద్ద హైదరాబాద్‌ నుంచి వచ్చిన కొందరు యువకులు కార్లతో ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తూ విన్యాసాలు చేయడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. నీటి ఉధృతి, లోతు తెలియకుండా ఈతకు దిగడం, జారే రాళ్లపై నిలబడి ప్రాణాలకు తెగించి సెల్ఫీలు దిగడం, మద్యం సేవించి నీటిలో అడుగుపెట్టడం వంటి చర్యల వల్ల మునిగిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

పర్యాటకులకు పోలీసుల, అధికారుల సూచనలు

● బ్యాక్‌వాటర్స్‌లో అడుగుభాగం బురదతో కూడుకుని, హఠాత్తుగా లోతుగా మారే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి దిగవద్దు.

● పిల్లలు నీటి దరిదాపులకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక పర్యవేక్షణ వహించాలి.

● వంతెనల అంచులు, నీటి ప్రవాహం వద్ద, జారే రాళ్లపై ప్రమాదకరంగా సెల్ఫీలు, రీల్స్‌ చేయోద్దు.

● ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం జరిగితే వెంటనే డయల్‌ 112 లేదా 100కి సమాచారం అందించాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జలాశయాల వద్ద పర్యాటకుల సందడి

ప్రకృతిని చూసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోవద్దు

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు, అధికారులు

2020లో శభాష్‌పల్లి వంతెన వద్ద ఇద్దరు విద్యార్థులు సెల్పీలు దిగే క్రమంలో కాలుజారి జలాశయంలో పడి మృతి చెందారు.

2021 మార్చిలో కొదురుపాక వంతెన వద్ద ఇల్లందుల సాయికృష్ణ(26), గడ్డం రాజశేఖర్‌ రెడ్డి(30) మరణించారు. సాయికృష్ణ నీటిలో దూకి ఆత్మహత్య చేసుకోగా చూసేందుకు వెళ్లిన రాజశేఖర్‌ రెడ్డి ప్రమాదవశాత్తు జారిపడి మునిగిపోయాడు.

2021 నవంబర్‌లో సిరిసిల్ల చెక్‌డ్యాం వద్ద ఆరుగురు విద్యార్థులు కొలిపాక గణేశ్‌(15), తేగల అజయ్‌(14), కొంగ రాకేశ్‌(15), జడల వెంకటసాయి(14), శ్రీరాముల క్రాంతి (14), సింగం మనోజ్‌(16) మృతిచెందారు. ఈత కొట్టేందుకు వెళ్లిన విద్యార్థులు చెక్‌డ్యాం వద్ద లోతైన గోతిలో ఒకరి తర్వాత ఒకరు మునిగిపోయారు.

2022 ఏప్రిల్‌లో మిడ్‌ మానేరు కందికట్కూర్‌ వద్ద కుర్రు శ్రీనివాస్‌(30), పొన్నం రాజు(27) మృతిచెందారు. కుటుంబ సభ్యులతో గుడికి వెళ్లి సరదాగా జలాశయంలో ఈత కొడుతుండగా నీటిలో మునిగి చనిపోయారు.

2023లో అప్పర్‌మానేరు వద్ద ఇద్దరు యువకులు ఈతకు వెళ్లి లోతైన నీటి గుంతల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.

2023లో తంగళ్లపల్లి ఎల్లమ్మ గుడికి వచ్చిన కుటుంబం సరదాగా చెక్‌డ్యాం నీటి వద్దకు వెళ్లగా భార్య, పిల్లలు మునిగిపోతుండగా భర్త నీటిలోకి దిగి వారిని రక్షించి అతను ప్రాణాలు కోల్పోయాడు.

2026 మేలో మిడ్‌మానేరు గోపాలరావుపల్లె వాగులో సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన ఇద్దరు యువకులు ఎదురుగట్ల హరిచరణ్‌ గౌడ్‌(18), అల్లం మణికంఠ(17) సరదాగా ఈతకువెళ్లి మునిగిపోయారు. మణికంఠను కాపాడే ప్రయత్నంలో హరిచరణ్‌ కూడా నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు.

జలాశయాల వద్ద నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాం. జలాశయాల సందర్శనకు వచ్చే పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి. ప్రమాదకర నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలి. సరదా విషాదంగా మారకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి.

– మహేష్‌ బీ గీతే, ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా

ఎగువ మానేరు, మిడ్‌ మానేరు జలాశయాల వద్ద నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులు, ప్రజలకు సమాచారం అందించాలి. నీటి ప్రవాహం ఎక్కువైతే ప్రజల క్షేమంకోసం రాకపోకలు నియంత్రించాలి.

– గరీమా అగ్రవాల్‌, కలెక్టర్‌ రాజన్న సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement