ట్రాక్టర్‌.. ఫికర్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌.. ఫికర్‌

Aug 10 2026 11:54 PM | Updated on Aug 10 2026 11:54 PM

ట్రాక్టర్‌.. ఫికర్‌

రిజిస్ట్రేషన్‌ లేకుండా ఎలా?

పంచాయతీ పాలకులకు ట్రాక్టర్‌ కష్టాలు

నెలకు రూ.43వేల వరకు నిర్వహణ భారం

వాహనాలకు రిజిస్ట్రేషన్లు, బీమా లేదు

కిస్తీలు, డీజిల్‌, మరమ్మతులు, సిబ్బంది వేతనాలతో సతమతం

‘భారాన్ని ప్రభుత్వమే భరించాలి’ అంటున్న సర్పంచ్‌లు

కరీంనగర్‌టౌన్‌: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీలకు అందించిన ట్రాక్టర్ల నిర్వహ ణ పాలకులకు భారంగా మారింది. నిధుల కొరతతో పాలకులు సతమతమవుతుండగా.. ట్రాక్టర్‌ కిస్తీలు, డీజిల్‌, మరమ్మతులు, సిబ్బంది వేతనాలు అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్లకు బీమా రెన్యూవల్‌ కాకపోవడం, రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది.

నెలకు రూ.43 వేల భారం

జిల్లాలోని 318 గ్రామపంచాయతీలున్నాయి. గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ, నర్సరీలకు నీటి సరఫరా, మొక్కలకు నీరు పట్టడం తదితర పనుల కోసం గత ప్రభుత్వం ట్రాక్టర్లు అందించింది. వాహన రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిందేనని అప్పుటి సర్పంచ్‌లపై ఒత్తిడి చేయడంతో కొత్త మంది చేయించారు. మరికొందరు విముఖత చూపారు. గతేడాది బాధ్యతలు చేపట్టిన కొత్త సర్పంచ్‌లు ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారిందని వాపోతున్నారు. నిర్వహణ ఖర్చులు పంచాయతీలపైనే పడుతున్నాయని సతమతవుతున్నారు. చిన్న పంచాయతీల్లో ఒక్క ట్రాక్టర్‌ నిర్వహణకు నెలకు సుమారు రూ.43 వేల వరకు ఖర్చవుతున్నట్లు చెబు తున్నారు. ట్రాక్టర్‌ కిస్తీకి రూ.16 వేలు, పారిశుధ్య కార్మికుల వేతనాలకు రూ.17వేలు, మరమ్మతులకు రూ.2,500, డీజిల్‌కు రూ.8 వేల వరకు ఖర్చవుతోందని పేర్కొంటున్నారు. చిన్న పంచాయతీలకు వచ్చే నిధుల్లో సగానికిపైగా ట్రాక్టర్‌ నిర్వహణకే వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద గ్రామాల్లోనూ పరిస్థితి అదే విధంగా ఉంది.

కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు పూర్తికాలేదని, మరికొన్ని వాహనాలకు బీమా గడువు ముగిసినా రెన్యూవల్‌ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిధుల కొరత, పాలకవర్గాలు లేకపోవడం తదితర కారణాలతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్‌, బీమా లేకుండా ట్రాక్టర్‌ నడపడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు జిల్లాలోని అన్ని పంచాయతీల ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌, బీమా వివరాలను పరిశీలించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. పంచాయితీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్‌లు వాణిజ్య విభాగం కిందికి వస్తాయి. ప్రతి మూడు నెలలకోసారి ట్రాక్టర్‌ ఇంజిన్‌కు రూ 400(వాహన జీవీడబ్యూపై ఆధారపడి ధర మారుతోంది) ట్రాలీకి రూ 770, ట్యాంకర్‌కు రూ.770 చొప్పున పంచాయతీలు పన్నులు చెల్లించాలి. ఏడాది బీమా ప్రీమియం రూ.13 వేల నుంచి రూ.15వేల వరకు కట్టాలి. వ్యవసాయ ఆధారిత ట్రాక్టర్లయితే మూడు నెలల పన్నులు ఉండవు. బీమా ప్రిమియం ఏడాదికి రూ.11 వేల ఉంటుంది. ఇలాంటి నిబంధనలు ఏ గ్రామ పంచాయితీలోనూ అమలు కావడం లేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement