కరీంనగర్ అర్బన్: జిల్లా వ్యవసాయశాఖ రైతుల సంక్షేమం కోసం పాటుపడాల్సింది పోయి అక్రమార్కులకు కొమ్ముకాస్తుందనే విమర్శఽలు వస్తున్నాయి. కల్తీరాయుళ్లను అరికట్టాల్సిందిపోయి మామూళ్ల మత్తులో తూగుతుందనే విమర్శలొస్తున్నాయి.
రూ.లక్షల్లో వ్యాపారం
ప్రభుత్వపరంగా విత్తనాలు, ఎరువుల ఉత్పత్తి అంతంతమాత్రమే.ప్రయివేటు కంపనీలపై ఆధారపడాల్సిన దుస్థితి. ఎరువులు నాణ్యమైనవా, కల్తీయా తేల్చే ఎరువుల నియంత్రణ కేంద్రం కొత్తపల్లిలో ఉంది. గతంలో ఆదృశ్య శక్తులు సదరు పరీక్ష కేంద్రానికి మోకాలడ్డగా సదరు వ్యక్తులే కల్తీ వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రూ.కోట్లలో దందా సాగుతుండగా వ్యవసాయ అధికారులు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది.
శాంపిళ్ల సేకరణ నామమాత్రమేనా.?
సీజన్‌కు 500 వరకు శాంపిళ్లను సేకరించాల్సి ఉండగా తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో మాత్రమే పరీక్ష కేంద్రాలున్నాయి. గతంలో హైదరాబాద్, వరంగల్‌కు శాంపిళ్లను పంపేవారు. ఇప్పుడు జిల్లాలోనే కేంద్రం ఉన్నా నామమాత్రంగా శాంపిళ్లను సేకరిస్తున్నారు.
సూత్రదారులెవరు.. పాత్రదారులెవరు..?
మొగ్ధుంపూర్‌లో వెలుగుచూసిన నకిలీ ఎరువుల బా గోతం నిశబ్దంగా మారడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో లైసెన్స్ సస్పెండ్ అయిన వ్యక్తి ఈ తతంగాన్ని నడుపుతున్నారని వ్యవసాయశాఖ చెబుతుండగా సూత్రదారులెవరు, పాత్రదారులెవరో తేల్చాల్సిన యంత్రాంగం మొద్దునిద్ర నటించడం ఆశ్చర్యకర పరిణామం. రైతులు ఎక్కడ కొనుగోలు చేశారు, విక్రయించిన వ్యక్తి ఎక్కడ నుంచి ఎరువులను తెచ్చారు, అసలు నకిలీ ఎరువు ఎక్కడ తయారవుతుంది. ఎవరెవరి పాత్ర ఎంత, అధికారు ల ప్రమేయం ఏమైనా ఉందా, ఇన్నాళ్లు దందా సాగుతుందంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు.. తదితర కోణాల్లో కూపీ లాగాల్సిందిపోయి వ్యవసాయ శాఖ చేతులు దులుపుకోవడం గమనార్హం.
గత నెల 9న మొగ్ధుంపూర్‌లో వ్యవసాయశాఖ అధికారి సత్యం తనిఖీలు చేసి కోరమాండల్ పేరిట ఉన్న నకిలీ 28.28.0 ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకుని శాంపిళ్లను సేకరించారు. నకిలీవని ఫర్టిలైజర్ కంట్రోల్ తేల్చడంతో కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నెలరోజులైనా సదరు కేసు పురోగతి లేదు. ఫర్టిలైజర్ నిర్వాహకుడు తాను విక్రయించ లేదంటున్నాడని, కేసును పక్కదారి పట్టిస్తున్నారని సమాచారం.


